పోస్టల్ బ్యాలట్లపై తగ్గని వైసీపీ.. తాజాగా సుప్రీంకు!

పోస్టల్ బ్యాలట్లకు సంబంధించిన ఇష్యూ కొత్త మలుపు తిరిగింది. ఈసీ జారీ చేసిన ఆదేశాలపై ఏపీ అధికార పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయటంతో పాటు న్యాయపోరాటానికి దిగిన సంగతి తెలిసిందే.

Update: 2024-06-03 04:20 GMT

పోస్టల్ బ్యాలట్లకు సంబంధించిన ఇష్యూ కొత్త మలుపు తిరిగింది. ఈసీ జారీ చేసిన ఆదేశాలపై ఏపీ అధికార పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయటంతో పాటు న్యాయపోరాటానికి దిగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా హైకోర్టును ఆశ్రయించటం.. అక్కడ ప్రతికూల ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో.. తాజాగా తన వాదనను వినిపించేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంను ఆశ్రయించింది.

షెడ్యూల్ ప్రకారం మరో రోజులో (మంగళవారం) ఉదయం ఓట్ల లెక్కింపు మొదలు కానుంది. ఇలాంటి వేళ.. ఈసీ జారీ చేసిన పోస్టల్ బ్యాలెట్ మార్గదర్శకాలపై తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ వైసీపీ సుప్రీంకోర్టు తలుపు తట్టింది. పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేయటం తెలిసిందే. ఈ అంశంపై ఏపీ ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరిస్తున్న సజ్జల మాట్లాడారు.

‘‘పోస్టల్ బ్యాలట్లకు సంబంధించిన తన మార్గదర్శకాలకు విరుద్ధంగా ఈసీ జారీ చేసిన ఆదేశాలు బరి తెగించినట్లుగా ఉన్నాయి. ఈ ఆదేశాలు తికమక పెట్టటానికి ఇచ్చారో? ఎందుకు ఇచ్చారో తెలియటం లేదు. అధికారి సంతకం ఉంటే సరిపోతుందని.. సీల్.. ఇతర వివరాలు అక్కర్లేదని చెబుతున్నారు. ఇది మరీ అడ్డగోలుగా ఉంది’’ అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

సంతకం ఎవరిదన్న విషయం ఎలా తెలుస్తుందని ప్రశ్నించిన సజ్జల.. ‘ఈసీ నిబంధనల్ని వాళ్లే తూట్లు పొడిచారు. ఆ సంతకం సంబంధిత అధికారిది కాకపోవచ్చు. కానీ.. అధికారులు మాత్రం సీల్ అవసరం లేదని చెప్పారు. అది కూడా ఏపీలోనే. వేరే రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి లేదు. అందుకే దీన్ని సవాలు చేశాం’’ అని వివరించారు. ఇదే అంశాన్ని ఏపీ హైకోర్టును ఆశ్రయించగా.. తాము ఈ విషయంలో కలుగజేసుకోవమని.. ఈసీకి ఫిర్యాదు చేసుకోవాలని చెప్పారు. ఏపీ హైకోర్టు స్పందించిన తీరుపై అసంత్రప్తితో ఉన్న వైసీపీ.. ఈ అంశంపై తమ వాదనను వినిపించేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రోజు వ్యవధిలో ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఎలా రియాక్టు అవుతుంది? ఏం చెబుతుందన్నది ఇప్పుడు ఉత్కంటగా మారింది.

Tags:    

Similar News