మమ్మల్ని డిక్టేట్ చేయొద్దు.. సుప్రీంకోర్టు సీజేకి కోపమొచ్చిన వేళ!
దేశంలో పెండింగ్ కేసులు లక్షల సంఖ్యలో ఉన్న సంగతి తెలిసిందే.
దేశంలో పెండింగ్ కేసులు లక్షల సంఖ్యలో ఉన్న సంగతి తెలిసిందే. ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి కేసులు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. వీటిపై సత్వర విచారణ జరగడం లేదు. స్థానిక కోర్టుల నుంచి సుప్రీంకోర్టు వరకు భారీ ఎత్తున జడ్జీల కొరత ఉంది. మరిన్ని కోర్టుల అవసరం కూడా ఉంది. ఈ నేపథ్యంలో చాలా కేసుల విచారణ నత్తనడకన సాగుతోంది.
ఈ నేపథ్యంలో తమ పిటిషన్ ను త్వరగా విచారించాలని కోరిన పిటిషనర్ తరఫు న్యాయవాదిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు నిరాకరిస్తుండటంతో ఉద్ధవ్ థాకరే వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఈ ఏడాది చివరలో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తమ పిటిషన్ పై ముందస్తు విచారణ చేపట్టాలని ఉద్ధవ్ థాకరే వర్గం ప్రధాన న్యాయమూర్తిని కోరింది. అయితే ఇందుకు సంబంధించిన పత్రాలు అందించేందుకు తమకు కొంత సమయం కావాలని ప్రతివాదులు (ఏకనాథ్ షిండే వర్గం) కోరడంతో వారం పాటు వారికి కోర్టు సమయమిచ్చింది.
దీంతో ఉద్ధవ్ వర్గం తరఫున వాదిస్తున్న న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ పిటిషన్ ను వాయిదా వేయకుండా విచారించాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతి ఒక్కరూ తమ కేసును ముందుగా విచారించాలని కోరుతున్నారని చంద్రచూడ్ అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో న్యాయమూర్తులపైన ఎంత ఒత్తిడి ఉందనేది చూడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయమూర్తుల మీద ఒత్తిడిని ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు.
లాయర్లు తమ స్థానంలో కూర్చుంటే తమ పరిస్థితి ఏంటో వారికి అర్థమవుతుందని చంద్రచూడ్ తెలిపారు. ఏదో ఒక రోజు లాయర్లు తమ స్థాననంలో కూర్చుంటే తమ సమస్యలు ఏంటో తెలుస్తాయన్నారు. తాము ఎంత ఒత్తిడితో పనిచేస్తున్నామో అర్థమవుతుందన్నారు.
న్యాయవాదులు తమను శాసించొద్దని సీజీఐ చంద్రచూడ్ స్పష్టం చేశారు. ప్రతిఒక్క పిటిషన్‌పై విచారణ జరుపుతామని తెలిపారు. దానికి ఒక తేదీని నిర్ణయిస్తామన్నారు. కోర్టులు, న్యాయమూర్తులపై ఉన్న పని ఒత్తిడిని అర్థం కోవాలని సూచించారు.