ఓటీటీలో రిలీజ్.. దర్శకుడు బాలాజీకి నెల రోజులు జైలు

కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ.. వాటిని పట్టించుకోకుండా వ్యవహరించిన దర్శకుడికి జైలుశిక్షను విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

Update: 2024-04-08 06:30 GMT

కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ.. వాటిని పట్టించుకోకుండా వ్యవహరించిన దర్శకుడికి జైలుశిక్షను విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తమిళనాడుకు చెందిన దర్శకుడు బాలాజీకి నెల రోజులు జైలుశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పును ఇచ్చింది. ఈ మొత్తం వివాదం డీ3 మూవీకి సంబంధించి చోటు చేసుకుంది. ఇంతకూ అసలేం జరిగిందంటే..

ప్రజిన్ హీరోగా బాలాజీ దర్శకుడిగా వ్యవహరిస్తూ నిర్మించిన డీ3 మూవీని బి మాస్ ఎంటర్ టైన్ మెంట్.. జేకేఎం ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మించాయి. గత ఏడాది మార్చిలో ఈ మూవీ విడుదలైంది. ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సామువేల్ గాడ్సన్ నుంచి రూ.4 కోట్లు అప్పుగా తీసుకున్నారు నిర్మాత మనోజ్. ఈ సందర్భంగా ఆయన ఒక ఒప్పందం చేసుకున్నారు. దాని ప్రకారం.. 60 శాతం సినిమా హక్కుల్ని సామువేల్ కు ఇచ్చేందుకు ఒప్పుకున్నారు.

అయితే.. ఆ డీల్ ను అతిక్రమిస్తూ సినిమాను విడుదల చేశారన్నది సామువేల్ ఆరోపణ. దీనికి సంబంధించి ఒక పిటిషన్ ను కోర్టులో దాఖలు చేశారు. దీన్ని విచారించిన న్యాయస్థానం ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయటంపై బ్యాన్ విధించింది. అదే సమయంలో సినిమా విడుదల తర్వాత వచ్చిన ఆదాయానికి సంబంధించిన వివరాల్ని కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. కానీ.. కోర్టు ఉత్తర్వుల్ని ఉల్లంఘిస్తూ ఈ మూవీని ఓటీటీలో విడుదల చేశారు.

దీంతో పిటిషనర్ మరోసారి కోర్టును ఆశ్రయించారు. కోర్టు స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ సినిమాను ఓటీటీలో విడుదల చేయటంపై కోర్టు ధిక్కార పిటిషన్ ను దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్టు దర్శకుడు బాలాజీకి నెల రోజులు జైలుశిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అదే సమయంలో కోర్టు ఎదుట హాజరు కాని నిర్మాత మనోజ్ ను అరెస్టు చేయాల్సిందిగా వారెంట్ జారీ చేస్తూ.. ఈ కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 24కు వాయిదా వేశారు. మరి.. వారి వాదన ఏమిటన్నది బయటకు రావాల్సి ఉంది.

Tags:    

Similar News