తీరు మార్చుకోరా? అంటూ హైడ్రాపై హైకోర్టు సీరియస్

అక్రమ నిర్మాణాల కూల్చివేతల విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్ని పట్టించుకోకుండా హైడ్రా వ్యవహరిస్తోందంటూ తెలంగాణ హైకోర్టు సీరియస్ అయ్యింది.

Update: 2025-01-01 05:08 GMT

అక్రమ నిర్మాణాల కూల్చివేతల విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్ని పట్టించుకోకుండా హైడ్రా వ్యవహరిస్తోందంటూ తెలంగాణ హైకోర్టు సీరియస్ అయ్యింది. తాజాగా ఖాజాగూడలోని నిర్మాణాల్ని కూల్చివేతల్ని సవాలు చేస్తూ.. మేకల అంజయ్య తదితరులు మంగళవారం లంచ్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. హైడ్రా పైనా.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీద సీరియస్ అయ్యింది.

గతంలో కూల్చివేతల విషయంలో హెచ్చరికలు జారీ చేసిన తర్వాత కూడా తీరు మార్చుకోకపోవటంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. నోటీసులు జారీ చేసిన 24 గంటలు గడవకముందే కూల్చివేతలు చేపట్టటం ఏమిటి? అని ప్రశ్నించింది. ఇదే తీరును ప్రదర్శిస్తే మరోసారి కోర్టు ఎదుట హాజరు కావాల్సి వస్తుందని పేర్కొంది.. అసలేం జరిగిందంటే.. శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడ గ్రామంలోని సర్వే నంబరు 18ఇలో 12,640 చదరపు గజాల స్థలంలోని నిర్మాణాలు ఎఫ్ టీఎల్ పరిధిలో ఉన్నట్లుగా హైడ్రా పేర్కొందని. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేతలు చేపడుతున్నట్లుగా మేకల అంజయ్య తదితరులు హైకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్ ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ విచారణ చేపట్టారు. హైడ్రా తరఫు న్యాయవాది కటిక రవీందర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. హైడ్రా అధికారులు అక్కడ విచారణ చేపట్టిన తర్వాతే చర్యలు తీసుకున్నట్లుగా పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. అనుమతులు తీసుకోకుండానే పిటిషనర్లు నిర్మాణాలు చేపట్టినట్లుగా పేర్కొన్నారు. వీరి వాదనలు విన్న న్యాయమూర్తి.. నోటీసులు ఇవ్వకుండానే ఎలా కూల్చివేతలు చేపడతారని ప్రశ్నించారు.

నోటీసులు ఇచ్చినట్లుగా లాయర్ చెప్పగా.. 24 గంటలే టైం ఇస్తారా? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. కనీసం బాధితుల వివరణ తీసుకోకుండా కూల్చివేతలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఎఫ్ టీఎల్ నిర్ధారిస్తూ నోటిపికేషన్ జారీ చేశారా? అని ప్రశ్నించిన న్యాయమూర్తి.. తాజాగా నోటీసులు జారీ చేసి.. పిటిషనర్ల వివరణ తీసుకున్న తర్వాత చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఒకవేళ అనుమతులు తీసుకోకుండా పిటిషనర్లు ప్రహరీతో సమా ఏవైనా నిర్మాణాల్ని చేపట్టి ఉంటే.. వాటిని జీహెచ్ఎంసీ కూల్చివేయొచ్చని పేర్కొంటూ.. పిటిషన్ పై విచారణను ముగించారు. ఈ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది.

Tags:    

Similar News