హిందూ వివాహాలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు!

ఆచారాలు లేకుండా జరిగిన ఓ పెళ్లికి సంబంధించి దాఖలైన పిటిషన్‌ విచారించిన అలహాబాద్‌ హైకోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది.

Update: 2023-10-05 07:53 GMT

భారతదేశంలో పెళ్లికి ఒక విశిష్టత ఉంది. ఏ మతానికి చెందిన వివాహాలయినా సంప్రదాయాలు, ఆచారాలు, కట్టుబాట్లకు లోబడి జరుగుతాయి. ఇక హిందూ వివాహాల గురించి చెప్పాల్సిన పనిలేదు. పెళ్లి చూపుల నుంచి లగ్నం పెట్టుకోవడం, పసుపు కొట్టడం, పెళ్లి కూతురు, పెళ్లి కొడుకుని చేయడం, మెహందీ, సంగీత్, వివాహం, తర్వాత నోము (వృతం), 16 రోజుల పండుగ ఇలా ప్రతిదీ ప్రత్యేకమే.

పెళ్లంటే ఐదు రోజుల వేడుక. ఇందులో తరతరాలుగా వస్తున్న ఆచారాలు, సంప్రదాయాలు ఇలా ఎన్నో ముడిపడి ఉంటాయి. ఈ నేపథ్యంలో అలహాబాద్‌ హైకోర్టు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. సప్తపది, ఆచారాలు లేకుండా జరిగే పెళ్లిళ్లు అసలు చెల్లవని సంచలన తీర్పు ఇచ్చింది.

దీంతో ఇకపై ఆచారాలు, సంప్రదాయాలు పాటించకుండా తూతూమంత్రంగా చేసుకోవడం కుదరదు. వాటికి గుర్తింపు కూడా ఉండదని అలహాబాద్‌ హైకోర్టు తేల్చిచెప్పినట్టయింది. అలాగే ఇలాంటి పెళ్లిళ్లపై వచ్చే కేసులకు సంబంధించి ఈ ఆదేశాలు ప్రామాణికం కానున్నాయి. ఆచారాలు లేకుండా జరిగిన ఓ పెళ్లికి సంబంధించి దాఖలైన పిటిషన్‌ విచారించిన అలహాబాద్‌ హైకోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది.

విడాకులు తీసుకోకుండానే విడిపోయిన తన భార్య రెండో వివాహం చేసుకుందని ఒక వ్యక్తి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 2017లో పిటిషనర్‌ సత్యం సింగ్‌ కు స్మృతి సింగ్‌ తో ఘనంగా పెళ్లి జరిగింది. అయితే ఆమె అత్తమామల ఇంటిని విడిచిపెట్టి, కట్నం కోసం వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ పోలీసు స్టేషన్‌ లో ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ఆమె రెండో పెళ్లి చేసుకుందని సత్యం సింగ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా హైకోర్టులో పిటిషన్‌ వేశాడు.

దీనిపై విచారణ జరిపిన అలహాబాద్‌ హైకోర్టు.. ఆ పెళ్లిని రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. ఈ కేసుపై న్యాయమూర్తి జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌ సింగ్‌ విచారణ జరిపారు. ఈ సందర్భంగా పెళ్లి అనే పదానికి సరైన ఆచారాలతో, సంప్రదాయాలతో వివాహాన్ని జరుపుకోవడం అని అర్థం వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. అలా ఆచారాలు, సంప్రదాయాలతో జరగకపోతే మాత్రం దాన్ని పెళ్లి అనలేమని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

పెళ్లి అనేది చెల్లుబాటు అయ్యే వివాహం కాకపోతే చట్టం ప్రకారం.. అది వివాహం కిందకు రాదని అలహాబాద్‌ హైకోర్టు వెల్లడించింది. హిందూ చట్టం ప్రకారం సప్తపది వేడుక పెళ్లిని చెల్లుబాటుగా గుర్తించేందుకు అవసరమైన వాటిల్లో ఒకటిగా పేర్కొంది. కానీ పిటిషన్‌ వేసిన వ్యక్తి విషయానికి సంబంధించిన పెళ్లిలో అలాంటి వేడుక ఏమీ జరగలేదని హైకోర్టు తెలిపింది. కాబట్టి ఈ పెళ్లి చెల్లుబాటు కాదని స్పష్టం చేసింది. 1955 నాటి వివాహ చట్టం ప్రకారం.. సప్తపదిæ వేడుకలు, ఆచారాలు జరిగితేనే పెళ్లిగా దాన్ని గుర్తిస్తారని వెల్లడించింది.

Tags:    

Similar News