భార్య బాధ్యతను గుర్తు చేసిన హైకోర్టు.. ఆసక్తికర వ్యాఖ్యలు!
భర్త కుటుంబంలో భార్య అంతర్భాగమవ్వాలని, వేరు కాపురం కోసం తన భర్తపై ఆమె ఒత్తిడి చేయడం సరికాదని తాజాగా ఓ కేసులో తీర్పు ఇస్తూ ఝార్ఖంఢ్ హైకోర్టు వ్యాఖ్యానించింది.
భర్త కుటుంబంలో భార్య అంతర్భాగమవ్వాలని, వేరు కాపురం కోసం తన భర్తపై ఆమె ఒత్తిడి చేయడం సరికాదని తాజాగా ఓ కేసులో తీర్పు ఇస్తూ ఝార్ఖంఢ్ హైకోర్టు వ్యాఖ్యానించింది. సుమారు పాతిక పేజీల తీర్పులో న్యాయమూర్తి జస్టిస్ చాంద్.. మనుస్మృతి, రుగ్వేదం, యజుర్వేదంలోని అంశాలను ప్రస్తావించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి!
అవును... భారత్ లోని మహిళలకు వృద్ధ అత్తమామలకు, అమ్మమ్మలకు సేవ చేయాల్సిన బాధ్యత ఉందని జార్ఖండ్ హైకోర్టు పేర్కొంది. వృద్ధ అత్తమామలకు సేవ చేయడం భారత సంప్రదాయాల్లో ఉందని వివరించింది. ఓ విడాకుల కేసు విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. పాశ్చాత్య దేశాల్లో వివాహమవ్వగానే కుమారుడు తన కుటుంబం నుంచి వేరుపడతాడని, అయితే... భారత్ లో మాత్రం ఇందుకు విరుద్ధంగా జరుగుతుందని పేర్కొంది.
ఇదే సమయంలో... కారణం లేకుండా భర్త నుంచి విడిపోతే మనోవర్తి పొందే హక్కు భార్యకు ఉండదని జస్టిస్ చాంద్ వెల్లడించారు. డుమ్కా ఫ్యామిలీ కోర్టు ఆదేశాన్ని సవాల్ చేస్తూ ఝార్ఖండ్ హైకోర్టుని ఓ వ్యక్తి ఆశ్రయించగా... తాజాగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా భర్త కుటుంబంలో భార్య పాత్రను గుర్తుచేసింది. ఇదే సమయంలో... అది భారతీయ సంస్కృతిలో భాగమని వెల్లడించింది.
వివరాళ్లోకి వెళ్తే... పియాలీ రే ఛటర్జీ అనే మహిళ తన భర్త రుద్ర నారాయణ్ కట్నం కోసం డిమాండ్ చేస్తూ ఇబ్బందిపెడుతున్నాడని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 125 కింది మెయింటనెన్స్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ సమయంలో ఫ్యామిలీ కోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పునిచ్చింది. దీంతో రుద్ర నారాయణ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ సుభాష్ చంద్ ధర్మాసనం విచారించింది.
మరోపక్క... తన తల్లిని, అమ్మమ్మను ఇంటి నుంచి వెళ్లగొట్టాలని పిటిషనర్ తనపై ఒత్తిడి తెచ్చినట్లు కేసులో భర్త పేర్కొన్నారు. విచారణలో తన అత్తగారు(75), అమ్మమ్మకు సేవ చేయడం ఇష్టం లేకే భార్య ఇలాంటి వాదనలు తీసుకువచ్చిందిన కోర్టు గుర్తించింది. దీంతో విడిగా ఉండాలని భర్తపై ఒత్తిడి తీసుకువచ్చిందని.. సెక్షన్ 125(4) ప్రకారం భార్య సహేతుకమైన కారణం లేకుండా భర్తతో కలిసి ఉండటానికి నిరాకరిస్తే భరణాన్ని తిరస్కరించడానికి అవకాశం ఉందని కోర్టు పేర్కొంది. ఈ సందర్భంగా పై వ్యాఖ్యలు చేసింది.