ఆ హైకోర్టు కీలక తీర్పు.. కూతుళ్లు చనిపోయినా వారి పిల్లలకు ‘ఆస్తి’

కుమార్తెలు మరణించినంత మాత్రాన.. వారి పిల్లలకు పిత్రార్జిత ఆస్తిలో వాటా ఉండదన్న వాదనలో అర్థం లేదన్న విషయాన్ని స్పష్టం చేసింది కర్ణాటక హైకోర్టు.

Update: 2024-01-09 05:02 GMT

కుమార్తెలు మరణించినంత మాత్రాన.. వారి పిల్లలకు పిత్రార్జిత ఆస్తిలో వాటా ఉండదన్న వాదనలో అర్థం లేదన్న విషయాన్ని స్పష్టం చేసింది కర్ణాటక హైకోర్టు. తాజాగా తమ ముందుకు వచ్చిన ఒక కేసు విచారణలో భాగంగా కీలక వ్యాఖ్యలు చేశారు. పిత్రార్జిత ఆస్తిలో కుమార్తెలకున్న హక్కు విషయాన్ని మరోసారి స్పష్టం చేయటమే కాదు.. దానికి సంబంధించిన కీలక నిర్ణయాన్ని వెల్లడించారు.

తమ తోబుట్టువులు మరణించారని.. అలాంటప్పుడు వారికి కానీ వారి సంబంధీకులకు ఆస్తి ఇవ్వాల్సిన అవసరం ఏమిటంటూ.. పిటిషన్ దాఖలు చేసిన వారి వాదనను కర్ణాటక హైకోర్టు తోసిపుచ్చింది. మధ్య కర్ణాటకలోని నరగుందకు చెందిన చెన్నబసప్ప అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేవారు. తన తండ్రి ఆస్తిని చనిపోయిన తన తోబుట్టువుల పిల్లలకు ఎలా ఇస్తామన్నది ఆయన వాదన. దీనిపై కోర్టును ఆశ్రయించగా.. ఈ అంశంపై పూర్తి క్లారిటీ ఇచ్చింది కర్ణాటక హైకోర్టు.

పిత్రార్జిత ఆస్తిలో హక్కు అనేది కుమార్తె.. కుమారుడికి పుట్టుకతోనే వస్తుందని.. కుమారుడు చనిపోయిన తర్వాత అతని వారసులకు పిత్రార్జిత ఆస్తిలో హక్కు ఎలా అయితే వస్తుందో.. అదే తరహాలో కుమార్తెలకు అలాంటి హక్కే ఉంటుందని స్పష్టం చేసింది. రాజ్యాంగ సమానత్వ సూత్రాలను కోర్టులు కాపాడుతూ.. లింగ వివక్ష లేకుండా చూడాలంటూ కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సచిన్ శంకర్ మగదం పేర్కొన్నారు.

Tags:    

Similar News