కేరళ కోర్టు సంచలనం.. ట్యూషన్ టీచర్ కు 111 ఏళ్ల జైలుశిక్ష
సంచలన తీర్పును ఇవ్వటం ద్వారా కేరళలోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలనాన్ని క్రియేట్ చేసింది.
సంచలన తీర్పును ఇవ్వటం ద్వారా కేరళలోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలనాన్ని క్రియేట్ చేసింది. ఒక దారుణ నేరానికి తగిన శిక్ష విధించటం ద్వారా.. మిగిలిన వారు సైతం ఇదే విధానాన్ని అనుసరిస్తే బాగుంటుందన్న భావనను వ్యక్తమయ్యేలా చేసింది. ఒక మైనర్ మీద ట్యూషన్ టీచర్ అత్యాచారానికి పాల్పడిన ఉదంతంలో సదరు.. నిందితుడ్ని దోషిగా నిర్దారించిన కోర్టు ఏకంగా 111 ఏళ్ల జైలు శిక్షను విధించింది. దీనికి తోడుగా రూ.1.05 లక్షల ఫైన్ విధించిన కోర్టు.. ఒకవేళ ఆ మొత్తాన్ని చెల్లించని పక్షంలో మరో ఏడాది జైల్లో ఉండాలని పేర్కొంది. ఇంతకూ ఇతగాడు చేసిన దారుణ నేరం వివరాల్లోకి వెళితే..
44 ఏళ్ల మనోజ్ కేరళ నివాసి. ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికి ఇంటి వద్ద ట్యూషన్లు చెప్పేవాడు. తన వద్దకు ట్యూషన్ కు వచ్చిన ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అక్కడితో ఆగని ఈ కామపిశాచి మైనర్ బాలిక ఫోటోల్ని తీసి.. ఇతరులకు పంపాడు. ఈ ఘటనతో భయపడిపోయిన ఆ అమ్మాయి ట్యూషన్ కు వెళ్లటం మానేసింది. దీంతో.. అసలేమైందని ఆరా తీసిన తల్లిదండ్రులు .. అసలు విసయం తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దారుణం 2019లో చోటు చేసుకుంది.
ఫిర్యాదు తీసుకున్న పోలీసులు.. రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ఫిర్యాదులో పేర్కొన్న దారుణ నేరానికి అతడు పాల్పడిన విషయాన్ని నిర్దారించారు. దీంతో.. అతడ్ని అరెస్టు చేశారు. అతడి ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. నేరం జరిగిందని చెబుతున్న రోజున తాను ఇంట్లో లేనని.. ఆఫీసులో ఉన్నట్లుగా అబద్ధం చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడు.అయితే.. అదంతా అబద్ధమన్న విషయాన్ని పోలీసులు తమ విచారణలో నిర్దారించారు. కాల్ రికార్డులు.. ఫోన్ లొకేషన్ ఆధారంగా దారుణ ఘటన జరిగిన రోజున అతడు ఇంటికి సమీపంలోనే ఉన్నట్లుగా తేలింది. ఈ కేసుపై విచారణ జరిపిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిందితుడికి 111 ఏళ్ల కఠిన శిక్షను విధిస్తూ సంచలన తీర్పును ఇచ్చింది. ఈ తరహా నేరాలకు పాల్పడే వారి విషయంలో న్యాయస్థానాలు మరింత కఠినంగా ఉండాల్సిన అవసరముంది.