వైద్య విద్యార్థిని హత్యాచారంపై సుప్రీం సూటి ప్రశ్నలు విన్నారా?

కోల్ కతా ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్య విద్యార్థినిపై జరిగిన హత్యాచార ఉదంతం దేశ వ్యాప్తంగా తీవ్రమైన నిరసనలు.. ఆందోళనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే

Update: 2024-08-21 04:28 GMT

కోల్ కతా ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్య విద్యార్థినిపై జరిగిన హత్యాచార ఉదంతం దేశ వ్యాప్తంగా తీవ్రమైన నిరసనలు.. ఆందోళనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టటం తెలిసిందే. ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం చేపట్టింది. ఈ సందర్భంగా పలు సూటి ప్రశ్నలను సంధించింది.

ముఖ్యంగా ఎఫ్ఐఆర్ దాఖలు చేయటంలో జరిగిన అసాధారణ జాప్యంపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని తప్పు పట్టింది. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సర్ది చెప్పే ప్రయత్నం చేయగా.. కలుగజేసుకున్న సుప్రీం ప్రధాన న్యాయమూర్తి వేసి ప్రశ్నలకు ఆయన నోటి వెంట మాట రాని పరిస్థితి. ‘‘అదేంటి సిబల్.. హత్యాచార ఘటన తెల్లవారుజామున గుర్తించినట్లు తెలుస్తోంది. అలాంటిది ఈ ఉదంతంపై ఎఫ్ఐఆర్ ను వైద్యవిద్యార్థిని మ్రతదేహాన్ని అంత్యక్రియలకు అప్పగించిన మూడు గంటల తర్వాత రాత్రి 11.45 గంటలకు ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి వచ్చింది? అప్పటివరకు ఆసుపత్రి అధికారులు.. కోల్ కతా పోలీసులు ఏం చేస్తున్నారు? మ్రతదేహాన్ని చూపించేందుకు తల్లిదండ్రులను గంటల పాటు వేచి చూసేలా ఎందుకు చేశారు? దీన్ని మీరెలా సమర్థించుకుంటారు’’ అని సూటిగా అడిగేయటంతో కపిల్ సిబల్ నోట మాట రాలేదు.

వైద్య విద్యార్థిని హత్యాచారాన్ని వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ ఎలా ఆత్మహత్యగా చెబుతారు? ఒక డాక్టర్ గా ఆయనకు అవగాహన లేదంటారా? అంత ఘోరం జరిగితే ఆత్మహత్య అని ఎలా చెప్పారు?’’ అని చెప్పినప్పుడు అసలు జరిగింది అది కాదని.. తాము కోర్టుకు అన్ని వివరాలు అందజేస్తామని చెప్పే ప్రయత్నం చేశారు కపిల్ సిబల్. దీంతో మళ్లీ మాట్లాడిన చీఫ్ జస్టిస్ చంద్రచూడ్.. ‘వైద్య కళాశాల ప్రిన్సిపల్ ను వేరే కాలేజీకి ఎలా బదిలీ చేసతారు? గంటల వ్యవధిలోనే ఎలా పోస్టింగ్ ఇస్తారు’’ అంటూ వేసిన ప్రశ్నలకు కపిల్ సిబల్ నోటి వెంట మాట రాని పరిస్థితి. ఈ సందర్భంగానే ఎఫ్ఐఆర్ నమోదు అంశాన్ని ప్రస్తావించారు ప్రధాన న్యాయమూర్తి.

కోల్ కతాలోని ఆర్ జీకార్ వైద్య కళాశాలలో.. ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటన అత్యంత పాశవికం.. భయంకరమైనదిగా పేర్కొన్న సుప్రీంకోర్టు ధర్మాసనం బెంగాల్ ప్రభుత్వం స్పందించిన తీరును తీవ్రంగా తప్పు పట్టింది. అంతేకాదు.. నేరం జరిగిన స్థలాన్ని సంరక్షించే విషయంలోనూ చోటు చేసుకున్న వైఫల్యాన్ని తప్పు పట్టింది. పోలీసు శాఖను ప్రశ్నించింది. వైద్య కళాశాల ప్రిన్సిపల్ వ్యవహరించిన తీరును తప్పు పడుతూ.. వైద్య సేవల రంగంలో పని చేస్తున్న మహిళలు.. యువ వైద్యులు.. సిబ్బంది భద్రత విషయంలో సంస్థాగత లోపాలు ఉన్నాయన్న ఆందోళనను వ్యక్తంచేసింది. ఈ నెల 22 లోపు కేసుకు సంబంధించిన పూర్తి నివేదిక సమర్పించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.

ఆసుపత్రిపై అల్లరిమూక దాడిని నివారించటంతో ప్రభుత్వ.. పోలీసు వైఫ్యలాన్ని ప్రశ్నించిన సుప్రీం.. నిందితులపై ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలన్నారు. అంతేకాదు..హత్యాచార ఘటనను నిరసిస్తూ శాంతియుతంగా ఆందోళనకు దిగిన వారిపట్ల బెంగాల్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును ధర్మాసనం తప్పు పట్టింది. అదే సమయంలో బాధితురాలి పేరు.. ఫోటో.. డెడ్ బాడీకి సంబంధించి ఫోటోలు.. వీడియోలు మీడియాలో రావటంపై ఆవేదనను వ్యక్తం చేసింది.

Tags:    

Similar News