‘సిట్’ దెబ్బకు కోర్టు మెట్లెక్కుతున్నారు !
మాచర్లలో పోలింగ్ రోజున వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసినట్లు వెలుగులోకి వచ్చిన వీడియోలు కలకలం రేపాయి.
చిత్తూరు జిల్లా చంద్రగిరి, అనంతపురం జిల్లా తాడిపత్రి, మచిలీపట్నం, పల్నాడు జిల్లా మాచెర్ల ప్రాంతాలు పోలింగ్ రోజు, ఆ తర్వాత గొడవలతో అట్టుడికాయి. దేశంలో ఎక్కడా లేనివిధంగా పోలింగ్ అనంతరం చెలరేగిన హింసపై ఎన్నికల కమీషన్ సీరియస్ అయింది. విచారణకు సిట్ ను ఏర్పాటు చేసింది. హింసను అరికట్టడంలో విఫలమైన అధికారులపై బదిలీ, సస్పెన్షన్ వేటు వేసింది.
పద్మావతి విశ్వవిద్యాలయంలో స్ట్రాంగ్ రూమ్ కు వెళ్లిన చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని మీద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వర్గీయులు పట్టపగలే దాడికి దిగాయి.దీన్ని సీరియస్ గా తీసుకున్న ఎన్నికల కమీషన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అతని కుమారుడు మోహిత్ రెడ్డి మీద సెక్షన్ 120బి కింద కుట్ర కేసు నమోదు చేశారు.
మాచర్లలో పోలింగ్ రోజున వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసినట్లు వెలుగులోకి వచ్చిన వీడియోలు కలకలం రేపాయి. ఈ ఘటనలో అరెస్టును తప్పించుకునేందుకు పిన్నెల్లి అజ్ఞాతంలోకి వెళ్లాడు. నిన్నటి నుండి పోలీసులు అరెస్టు కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. పిన్నెల్లి పోలీసులకు దొరకకుండా దాగుడుమూతలు ఆడుతున్నాడు.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ, వైసీపీ శ్రేణుల గొడవల నేపథ్యంలో ఎమ్మెల్యేలు కేతిరెడ్డి పెద్దారెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామ్ రెడ్డిల మీద హత్యాయత్నంతో సహా మూడు కేసులు నమోదయ్యాయి. దీంట్లో రెండింటిలో కోర్టుకు వెళ్లి అరెస్టే చేయకుండా స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు. మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టుపై ఓటరు ఇంటి మీద దాడి చేసిన నేపథ్యంలో హత్యాయత్నం కేసు నమోదయింది. సిట్ ఈ కేసులను సీరియస్ గా తీసుకోవడంతో నిందితులు అందరూ అరెస్టులు తప్పించుకునేందుకు స్టేల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.