లేత వయసులో లివ్-ఇన్ రిలేషన్ షిప్... హైకోర్టు సంచలన తీర్పు!
ఇటీవల కాలంలో చాప కింద నీరులా భారతీయ (వివాహ / దాంపత్య) వ్యవస్థలోకి విస్తరించిన అంశం లివ్-ఇన్ రిలేషన్ షిప్ అని చాలామంది అభిప్రాయపడుతుంటారు.
ఇటీవల కాలంలో చాప కింద నీరులా భారతీయ (వివాహ / దాంపత్య) వ్యవస్థలోకి విస్తరించిన అంశం లివ్-ఇన్ రిలేషన్ షిప్ అని చాలామంది అభిప్రాయపడుతుంటారు. ఇది సమాజానికి ఏమాత్రం మంచిది కాదని చాలా మంది చెబుతున్నా.. ఇది ఒక రకంగా ఒత్తిడి రహిత సంసార జీవితం అని సమర్థించేవారూ లేకపోలేదనే అంటుంటారు.
ఇలా.. ఇటీవల కాలంలో లివ్-ఇన్ రిలేషన్ షిప్ పై ఆసక్తికర చర్చ బలంగా నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఓ ఆసకికర పరిణామం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా.. 18 ఏళ్లు మాత్రమే నిండిన ఇద్దరు పిటిషనర్ల లివ్-ఇన్ రిలేషన్ షిప్ పై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఇప్పుడు ఇది వైరల్ గా మారింది.
అవును... మధ్యప్రదేశ్ హైకోర్టు తాజాగా లివ్-ఇన్ రిలేషన్ షిప్ కి సంబంధించిన పిటిషన్ పై కీలక తీర్పు ఇచ్చింది. ఇందులో భాగంగా... మేజర్స్ అయిన వారు పెళ్లి చేసుకోకుండా కలిసి జీవించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే.. ఈ సమయంలో పలు విషయాలను పరిగణలోకి తీసుకోవడం ముఖ్యమని అభిప్రాయపడింది!
ఈ సందర్భంగా... పిటీషనర్లు ఇద్దరికీ 18 ఏళ్లు పైబడినవారేనని.. వారు స్వేచ్ఛగా జీవించే హక్కును కలిగి ఉన్నారని కోర్టు పేర్కొంది. ఈ కేసులో పిటిషనర్స్ తరుపున న్యాయవాది హేమంత్ సింగ్ రాణా వాదించగా.. ప్రతివాది తరుపున ప్రభుత్వ తరుపు న్యాయవాది మాన్ సింగ్ జూడోన్ వాదనలు వినిపించారు.
ఈ కేసులో తీర్పును జస్టిస్ వివేక్ జైన్ సింగిల్ బెంచ్ వెల్లడించింది. ఇకపై ఈ మేజర్స్ అయిన వారిపై బయట వ్యక్తుల జోక్యం నుంచి జీవించే హక్కును కాపాడుకోవాలని స్పష్టం చేసింది. అయితే... యువతి చిన్న వయసులోనే లివ్-ఇన్ రిలేషన్ షిప్ లో ఉండాలని నిర్ణయించుకునే నిర్ణయంపై మాత్రం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రధానంగా... ఆర్థిక స్థోమత లేకుండా.. పరిణితి లేని దశలోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వారి వారి భవిష్యత్తుకు సవాలుగా మారవచ్చని కోర్టు తెలిపింది. ఈ సందర్భంగా స్పందించిన పిటిషనర్ అయిన బాలిక... తన పరిస్థితులు తనకు ఈ నిర్ణయం తీసుకోవడానికి బలవంతం చేశాయని కోర్టుకు తెలిపిందని అంటున్నారు.
ఈ కేసులో అబ్బాయి, అమ్మాయి ఇద్దరి వయసూ 18 ఏళ్లు నిండినప్పటికీ.. ఇందులో అమ్మాయి వయసు కనీస వివాహ వయసు (21 సంవత్సరాలు) పూర్తి కాకపోవడం గమనార్హం.