లైంగిక వేధింపుల కేసులో యడియూరప్పకు నోటీసులు
లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) కేసుకు సంబంధించి విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు.
మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే అభియోగాలపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత యడియూరప్పకు సీఐడీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) కేసుకు సంబంధించి విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. 17 ఏళ్ల మైనర్ బాలికపై యడియూరప్ప లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఈ ఏడాది కేసు నమోదైంది.
చీటింగ్ కేసులో సాయం కోసం ఫిబ్రవరి 2న యడియూరప్ప సాయం కోసం వెళ్లిన సందర్భంలో తన కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బాలిక తల్లి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో
యడియూరప్పపై పోక్సో యాక్ట్‌తో పాటు ఐపీసీలోని సెక్షన్ 354(ఏ) కింద లైంగిక వేధింపుల కేసు నమోదైంది.
యడియూరప్ప తన న్యాయవాదుల ద్వారా సీఐడీ ముందు హాజరు కావడానికి ఒక వారం పొడగింపు కావాలని అభ్యర్థించారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఉన్నారు. ఇప్పటికే విచారణ బృందం ఆయనను మూడుసార్లు విచారించింది, ప్రస్తుతం ఆయన నాలుగోసారి విచారణకు హాజరుకావాల్సి ఉంది.
సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసును తదుపరి విచారణ కోసం సీఐడీకి బదిలీ చేశారు. 81 ఏళ్ల యడియూరప్ప కర్ణాటక బీజేపీలో సీనియర్ నేత. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2008-2011 మధ్య, 2018లో కొంత కాలం, మళ్లీ జూలై 2019-2021 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2021లో రాజీనామా చేశారు.