యా.. యా.. ఏంటి? ఇది కాఫీ షాప్ కాదు.. సుప్రీం చివాట్లు

దేశ అత్యున్నత న్యాయస్థానం ఎదుట హాజరయ్యే వేళ.. న్యాయస్థానానికి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

Update: 2024-10-01 07:30 GMT

దేశ అత్యున్నత న్యాయస్థానం ఎదుట హాజరయ్యే వేళ.. న్యాయస్థానానికి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలా వ్యవహరించని ఒక పిటిషనర్ పై మండిపడ్డారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్. ఒక ఉద్యోగి తన సర్వీసు వివాదానికి సంబంధించిన కేసు విచారణ సందర్భంగా పిటిషనర్ వ్యవహరించిన తీరును సీజేఐ తప్పు పట్టారు. ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పిటిషనర్ ను ఉద్దేశించి సీజేఐ అడిగిన ప్రశ్నలకు ఎస్ అనకుండా.. యా.. యా.. అంటూ సమాధానం ఇవ్వటాన్ని తప్పు పట్టారు.

‘‘యా.. యా.. ఏమిటి? ఇది కాఫీ షాప్ కాదు. దీన్ని మేం అనుమతించం’ అంటూ పిటిషనర్ కు చివాట్లు పెట్టిన వైనం ఆసక్తికరంగా మారింది. ఇంతకూ సీజేఐకు ఇంతలా చిర్రెత్తుకొచ్చిన వైనంలోకి వెళితే..ఒక ఉద్యోగి తన సర్వీసు వివాదానికి సంబంధించిన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ ను ప్రతివాదిగా పేర్కొంటూ ఒక పిల్ దాఖలు చేశారు. ఫూణెకు చెందిన పిటిషనర్ తీరుపై సీజేఐ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

‘‘సుప్రీంకోర్టు న్యాయమూర్తిని ప్రతివాదిగా చేర్చి పిల్ ఎలా వేస్తారు? కాస్తంత గౌరవం చూపించాలి. ఒక జడ్జికి వ్యతిరేకంగా అంతర్గత విచారణ చేపట్టాలని ఆషామాషీగా మీరెలా అడుగుతారు? జస్టిస్ రంజన్ గొగొయ్.. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి. ఆయన ధర్మాసనం ముందు మీరు కేసు గెలవని కారణంగా అంతర్గత విచారణను కోరలేరు’’అంటూ ఫైర్ అయ్యారు. ఇలాంటి తీరును తాము ఎట్టి పరిస్థితుల్లోనూ సహించలేమన్న సీజేఐ.. ఆయన పేరును ప్రతివాదుల లిస్టు నుంచి తీసేయాలని.. అప్పుడు మాత్రమే పిటిషనర్ అభ్యర్థనను పరిశీలిస్తామని పేర్కొన్నారు. ఈ వ్యవహరం ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News