ఎన్డీయేలో 'వర్గీకరణ'.. మిత్రపక్షాల అసమ్మతి స్వరం.. మళ్లీ సుప్రీం కోర్టుకు?

అసలే అతి స్వల్ప మెజారిటీతో మిత్రపక్షాలపై ఆధారపడుతూ నెట్టుకొస్తున్న బీజేపీకి ఇది మింగుడుపడని పరిణామమే.

Update: 2024-08-05 09:28 GMT

రాష్ట్రాలు ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ చేసుకోవచ్చంటూ గత వారం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై క్రమంగా రాజకీయ పార్టీలు తమ నిరసన స్వరాలు వినిపిస్తున్నాయి. తీర్పు వచ్చిన చాలా పార్టీలు మద్దతు తెలిపాయి. వ్యతిరేకించేవాటి వాయిస్ మాత్రం క్రమంగా బయటకు వస్తోంది. ఇవి దక్షిణాది కంటే ఉత్తరాది నుంచి వస్తుండడం కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ సారథి అయిన బీజేపీకి కలవరం రేపుతోంది. అసలే అతి స్వల్ప మెజారిటీతో మిత్రపక్షాలపై ఆధారపడుతూ నెట్టుకొస్తున్న బీజేపీకి ఇది మింగుడుపడని పరిణామమే.

బిహారీ పాసవాన్..

ఉత్తర భారతదేశం అంటే కులాల మేళా. అగ్ర వర్ణాలకు దీటుగా బీసీలు, ఎస్సీలు ఎదిగిన రాష్ట్రాలు బిహార్, ఉత్తరప్రదేశ్. ముఖ్యంగా బిహార్ లో రాం విలాస్ పాశ్వాన్ బలమైన దళిత నేతగా నిలిచారు. ఆయన నాలుగేళ్ల కిందట కన్నుమూశాక పార్టీలో ఒడిదొడుకులు ఎదురైనా.. గత ఏడాది రాంవిలాస్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ నిలదొక్కుకున్నారు. తాజాగా వర్గీకరణపై సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పును ఆయన వ్యతిరేకిస్తున్నారు. ఈ పార్టీకి ఆరుగురు ఎంపీలున్నారు. చిరాగ్ కేంద్ర మంత్రి కూడా. ఆయన సారథ్యంలోని లోక్ జన్ శక్తి సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేసేందుకు సిద్ధం అవుతోంది. ఇది బిహార్ లో జేడీయూతో కలిసి అధికారం పంచుకుంటున్న బీజేపీకి ఇది ఇరుకునపెట్టే వ్యవహారమే.

రివ్యూ పిటిషన్ కు వెళ్లనుందా?

లోక్ జనశక్తికి బిహార్ లో ఫలితాలను తారుమారు చేసేంత బలం ఉంది. బిహార్ వంటి చోట 25 ఏళ్లుగా ఆ పార్టీ మనుగడ సాగిస్తున్నదంటేనే దాని బలాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల ముంగిట లోక్ జన శక్తి సుప్రీం కోర్టు తీర్పును అంగీకరించడం లేదు. అంతేగాక బీజేపీ అభిప్రాయంతో సంబంధం లేకుండా సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయనున్నదని చెబుతున్నారు.

బీజేపీ మౌనమే అర్థంగీకారమా?

దక్షిణాది కంటే ఉత్తరాదిన దళిత నేతలు, దళితులు ప్రభావవంతంగా ఉన్నారు. అందుకే వర్గీకరణపై బీజేపీ మౌనం దాల్చుతోంది. బిహార్, జార్ఖండ్, మహారాష్ట్రల్లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలున్నాయి. దీంతో ఏం మాట్లాడితే ఏం ఇబ్బందో అని బీజేపీ నోరు మెదపడం లేదు. ఉత్తరాదిలో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ లలో సుప్రీంకోర్టు తీర్పు ప్రభావం పడనుంది. అందుకనే బీఎస్పీ అధినేత్రి, యూపీ మాజీ సీఎం మాయావతి సైతం ఈ తీర్పును వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు బీజేపీ సుప్రీం తీర్పుపై ఇంతవరకు అధికారికంగా స్పందించకపోవడం గమనార్హం. ఓ వర్గం ఓట్లు కోల్పోతామనే ఉద్దేశంతో నోరు మెదపడం లేదు. రిజర్వేషన్లను తీసేస్తుందనే అపవాదును మూటగట్టుకున్న బీజేపీ.. వర్గీకరణపై నోరెత్తవద్దని రాష్ట్రాల నేతలను ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా ఏమంతా భిన్నంగా లేదు. దక్షిణాది సీఎంలు రేవంత్ రెడ్డి, సిద్ధరామయ్యలు ఎస్సీ వర్గీకరణను స్వాగతించారు. ఉత్తరాది నేతలు మౌనంగా ఉన్నారు. అయితే, అక్కడ కాంగ్రె స్ చేతిలో ఉన్నది ఒక్కటే రాష్ట్రం (హిమాచల్) కాబట్టి మాట్లాడినా, మాట్లాడకపోయినా పట్టింపు రావడం లేదు.

Tags:    

Similar News