బ్యాంక్ కు బుద్ధి చెప్పేందుకు రూ.295 కోసం ఏడేళ్లు న్యాయపోరాటం

అవును.. రూ.295 కోసం ఏడేళ్లుగా న్యాయపోరాటం చేస్తున్న ఒక వ్యక్తి చివరకు తాను అనుకున్నది సాధించాడు.

Update: 2024-12-01 06:27 GMT

అవును.. రూ.295 కోసం ఏడేళ్లుగా న్యాయపోరాటం చేస్తున్న ఒక వ్యక్తి చివరకు తాను అనుకున్నది సాధించాడు. అన్యాయంగా తన ఖాతా నుంచి రూ.295 కట్ చేసిన అంశాన్ని ప్రశ్నించటమే కాదు.. బ్యాంక్ కు బుద్ధి చెప్పాలని డిసైడ్ అయిన ఈ ఉదంతం చివరకు బాధితుడికి ఊరట కల్పించేలా వినియోగదారుల ఫోరం నిర్ణయం తీసుకుంది. ఇంతకూ ఈ వ్యవహారం ఎక్కడ జరిగింది? అసలేం జరిగింది? అన్న వివరాల్లోకి వెళితే..

మధ్యప్రదేశ్ లోని జబల్ పుర్ జిల్లాకు చెందిన పనాగర్ కు చెందిన నిశాంత్ తామ్రకార్ అనే వ్యక్తి వాషింగ్ మెషిన్ ను కొనుగోలు చేశారు. ఇందుకోసం ఈఎంఐ ఆప్షన్ ను ఎంపిక చేసుకున్నారు. ఈ సందర్భంగా మొదటి ఈఎంఐ కింద డెబిట్ కావాల్సిన మొత్తం కంటే రూ.295 కట్ అయ్యింది. దీనిపై ఆయన బ్యాంక్ అధికారుల్ని సంప్రదించారు.

చెక్ డిడక్షన్ ఛార్జీగా బ్యాంక్ సిబ్బంది పేర్కొన్నారు. తగినంత మొత్తాన్ని తన బ్యాంక్ ఖాతాలో ఉంచుతానని.. చెక్ బౌన్స్ కావటానికి అవకాశమే లేదని పేర్కొన్నారు. తన ఖాతా నుంచి డెబిట్ చేసిన రూ.295 మొత్తాన్ని తన ఖాతాలో క్రెడిట్ చేయాలని బ్యాంక్ సిబ్బందిని కోరగా.. అందుకు వారు ససేమిరా అన్నారు. దీంతో.. బ్యాంక్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు.

ఇందుకోసం నిబంధనల ప్రకారం రూ.3వేల మొత్తాన్ని డిపాజిట్ చేసిన నిశాంత్, జబల్ పుర్ వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశారు. 2017లో మొదలైన ఈ కేసు ఇప్పటివరకు కంటిన్యూ అవుతోంది. ఏడేళ్ల అనంతరం తాజాగా వినియోగదారుల ఫోరం నిశాంత్ కు అనుకూలంగా తీర్పును ఇచ్చింది. వినియోదారునికి రూ.295తో పాటు రూ.4వేల మొత్తాన్ని పరిహారంగా చెల్లించాలని బ్యాంక్ కు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై స్పందించిన నిశాంత్.. తాను డబ్బుల కోసం ఇదంతా చేయలేదని.. వినియోగదారుగా తన హక్కుల రక్షణ కోసమే ఈ ఫైట్ చేసినట్లుగా పేర్కొనటం గమనార్హం.

Tags:    

Similar News