కాపురం బాగుందనడానికి ‘అదొక్కటే’ ప్రూఫ్ కాదు.. కోర్టు సంచలన వ్యాఖ్యలు!
అవును... సుమారు రెండేళ్లపాటు సాఫీగా సాగిన వీరి కాపురంలో కలతలు మొదలయ్యాయి.
నేరుగా మేటర్ లోకి వెళ్లిపోతే... కర్ణాటకలోని తమకూరుకు చెందిన ఒక మహిళకు.. ఐదేళ్లుగా పరిచయం ఉన్న యువకుడితో 2013 మార్చి 31 వివాహం జరిగింది. పెళ్లైన తర్వాత కూడా చదువుకున్న ఆమె ఎంటెక్ పూర్తిచేసింది. ఈ క్రమంలోనే రామనగర జిల్లా పంచాయతీ ఆఫీసులో ఉద్యోగంలో చేరింది. ఇలా రెండేళ్ల పాటు వారి కాపురం సంతోషంగా సాగింది. అనంతరం కలతల కథ మొదలైంది!
అవును... సుమారు రెండేళ్లపాటు సాఫీగా సాగిన వీరి కాపురంలో కలతలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా... భార్యపై అనుమానం పెంచుకున్న భర్త.. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆరోపించాడు. ఈ క్రమంలోనే తరుచూ ఆమె ఫోన్ చెక్ చేస్తుండేవాడు. ఇదే సమయంలో పలు కారణాలు చూపిస్తూ గొడవకు దిగి కొట్టడం వంటివి చేసేవాడంట.
ఈ సమయంలో భర్త వేధింపులను భరించలేక బాధితురాలు 2017లో బెంగళూరులోని తన అమ్మమ్మ ఇంటికి వెళ్లిపోయింది. అనంతరం విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. ఈ సందర్భంగా ఇచ్చిన పిటిషన్ లో తనను చిత్రహింసలకు గురిచేస్తూ, చంపడానికి కూడా ప్రయత్నించాడని పేర్కొంది. అయితే.. సదరు భర్త మాత్రం తన భార్య పీజీ చేసిందన్న అహంకారంతో వ్యవహరిస్తోందని ఆరోపించారు.
ఇదే క్రమంలో... తన తల్లిదండ్రులను వదిలిపెట్టి, వాళ్ల ఇంటి వద్దే ఉందామని తనపై ఒత్తిడి చేస్తోందని ఆరోపణలు చేశాడు. ఇదే సమయంలో ఆమెకు విడాకులు ఇవ్వడం ఇష్టం లేదని వాదించాడు. 2018లో దంపతులిద్దరూ ఒక వివాహానికి హాజరై కలిసి ఫొటో దిగిన ఫోటోను కోర్టుకు సమర్పించారు. వారిద్దరూ సంతోషంగా ఉన్నారని అతడి లాయర్ కోర్టుకు తెలిపారు.
వీరిద్దరూ అన్యోన్యంగానే ఉన్నారని.. అందువల్ల వారికి విడాకులు ఇవ్వాల్సిన అవసరం లేదని.. భార్యభార్తల మధ్య చిన్న చిన్న మనస్పర్థలు సమహం అన్నట్లుగా తెలిపాడు. దీంతో ఫ్యామిలీ కోర్టు.. మహిళ విడాకుల పిటిషన్ ను కొట్టివేసింది. అయితే... ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆమె కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది.
ఈ నేపథ్యంలో... ఒక ఫొటో ఆధారంగా భార్యాభర్తల మధ్య సాన్నిహిత్యాన్ని నిర్దారించలేమని, వారి బంధం సాఫీగా సాగుతున్నట్టు భావించలేమని కర్ణాటక హైకోర్టు అభిప్రాయపడింది. ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన దంపతులు, వేదికపై కలిసి ఫొటో దిగినంత మాత్రాన వారి మధ్య బంధం బాగానే ఉన్నట్లు కాదని వ్యాఖ్యానించింది. అనంతరం విడాకులు మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది.