కేసుల అనకొండ.. సుప్రీం కోర్టులో ఆల్ టైమ్ గరిష్ఠానికి స్కోరు

అయితే, ఇదంతా న్యాయ వ్యవస్థను కించపరచడమో, అవమానించడమో కాదు.. అక్కడి పని ఒత్తిడిని పరోక్షంగా గట్టిగా చెప్పడమే.

Update: 2024-08-30 09:29 GMT

కేసు గెలిచినవాడు.. ఓడినవాడు ఇద్దరూ ఏడ్చారట.. ఒకరు ఎలాగైనా గెలిచేందుకు ఆస్తులను అమ్ముకోగా.. మరొకరు లాయర్ ఖర్చలకు ఆస్తులను అమ్ముకున్నారని చెప్పే ఉద్దేశంలో ఇలా వ్యవహరిస్తుంటారు. ఎంతకూ తెగని కేసులు.. విచారణల జాప్యం.. కోర్టుల్లో సరిపడా న్యాయమూర్తులు లేని వైనం.. వీటన్నిటినీ లెక్కగడతూ పై ఉదాహరణలు చెబుతుంటారు. అయితే, ఇదంతా న్యాయ వ్యవస్థను కించపరచడమో, అవమానించడమో కాదు.. అక్కడి పని ఒత్తిడిని పరోక్షంగా గట్టిగా చెప్పడమే.

8 నెలల్లో 3 వేల కేసులు

ప్రపంచంలోనే అతిపెద్ద న్యాయ వ్యవస్థ మనది. అంతేకాదు.. కేసుల సంఖ్య కూడా ఎక్కువే. సివిల్, క్రిమినల్ వ్యాజ్యాలు కోర్టులను ముంచెత్తుతుంటాయి. ఇవికాక వివిధ దర్యాప్తు సంస్థలు నమోదు చేసేవి. ఈ తాకిడి కింది కోర్టుల నుంచి సుప్రీం కోర్టు స్థాయి వరకు ఉంటుంది. దేశ సర్వోన్నత న్యాయస్థానం అయిన సుప్రీం కోర్టులో ఈ ఏడాది జనవరి వరకు ఉన్న పెండింగ్ కేసులు 80,221. కానీ, ప్రస్తుతం ఆ సంఖ్య 83 వేలకు చేరింది. ఇది ఆల్ టైమ్ గరిష్ఠం కావడం గమనార్హం. కాగా, కేసుల తాకిడి కారణంగా.. సుప్రీం కోర్టులో జడ్జిల సంఖ్యను 31కి పెంచారు. 2009లో వీరి సంఖ్య 26. అయితే పదేళ్లలో పెండింగ్ కేసులు 8 రెట్లు పెరిగాయట. అంటే.. జడ్జిల నియామకం కంటే పోగవుతున్న కేసులు చాలా రెట్లు ఎక్కువని స్పష్టం అవుతోంది.

4 ఏళ్లలో 20 వేల పెరుగుదల?

2020లో అంటే కొవిడ్ కు ముందు సుప్రీం కోర్టులో పెండింగ్ కేసులు 65 వేలు మాత్రమే. మరుసటి సంవత్సరానికి అది 70 వేలకు, 2022లో 79వేలకు చేరింది. ఇక రెండేళ్లుగా 4 వేల కేసులు పెండింగ్ పడ్డాయి. దీంతో 83 వేలకు చేరాయి. కాగా, 27, 604 కేసులు (33 శాతం) ఏడాది వ్యవధిలోనివేనని గణాంకాలు చెబుతున్నాయి. ఈ సంవత్సరం 38,996 కొత్త కేసులు రాగా.. 37,158 కేసులను కొట్టివేశారు.

Tags:    

Similar News