తిరుమల లడ్డూ.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!

ఆంధ్రప్రదేశ్‌ లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వులు కలిశాయనే ఆరోపణల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం సిట్‌ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే.

Update: 2024-10-04 06:41 GMT

ఆంధ్రప్రదేశ్‌ లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వులు కలిశాయనే ఆరోపణల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం సిట్‌ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు సంస్థ లేదా సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, తదితరులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజాగా సంచలన తీర్పు వెలువరించింది. ఈ మేరకు అన్ని పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. లడ్డూ కల్తీ వ్యవహారంపై నిగ్గుతేల్చేందుకు స్వతంత్ర దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ పర్యవేక్షణలో ఐదుగురు సభ్యులతో దర్యాప్తు చేయాలని పేర్కొంది. ఈ దర్యాప్తు బృందంలో కేంద్రం నుంచి ఇద్దరు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు అధికారులు, ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా నుంచి ఒక అధికారి ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం భక్తుల విశ్వాసానికి సంబంధించిన అంశమని సుప్రీంకోర్టు ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయ నాటకాలకు అనుమతి ఇవ్వబోమని తేల్చిచెప్పింది.

గత విచారణలో తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందన్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నియమించిన సిట్‌ దర్యాప్తునే కొనసాగించాలా.. లేక కేంద్రం విచారణ జరిపించాలా అన్న అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిపిన సంగతి తెలిసిందే. అక్టోబర్‌ 4న జరగబోయే విచారణలో ఈ విషయాన్ని తేలుస్తామని సుప్రీంకోర్టు గత విచారణ సందర్భంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సిట్‌ విచారణను తాత్కాలికంగా నిలిపివేసింది.

ఈ నేపథ్యంలో అక్టోబర్‌ 4న విచారణ జరిపిన సుప్రీంకోర్టు సీబీఐ పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌ లతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. తిరుమల బాలాజీకి దేశవ్యాప్తంగా భక్తులు ఉన్నారన్నారు. భక్తులకు అందించే లడ్డూకు ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు. లడ్డూ కల్తీపై విచారణ జరపడానికి ఏపీ ప్రభుత్వం నియమించిన సిట్‌ పై తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అయితే దర్యాప్తుపై భక్తుల్లో మరింత విశ్వాసం కలిగించేందుకు సిట్‌ ను సీనియర్‌ కేంద్ర అధికారి పర్యవేక్షిస్తే బాగుంటుందన్నారు.

వైవీ సుబ్బారెడ్డి తరఫున కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపిస్తూ నిష్పాక్షికమైన, స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీ ప్రభుత్వం తరపున ప్రముఖ న్యాయవాది ముకుల్‌ రోహిత్గీ వాదనలు వినిపిస్తూ ఏపీ ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా సెప్టెంబర్‌ నెలలో చేసిన ప్రకటనకు, జూలైలో వెలువడిన ఈ కేసు నివేదికకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారని.. అయితే మీడియా కేవలం నాలుగు లైన్లు మాత్రమే సందర్భానుసారంగా తీసుకుందని ఆయన కోర్టుకు నివేదించారు.

Tags:    

Similar News