మొదటి భర్త ఆస్తిలో భార్యకు హక్కు... హైకోర్టు తీర్పు!

భర్త మరణానంతరం మరో వివాహం చేసుకున్న భార్యకు ఆస్తిలో వాటా దక్కుతుందా.

Update: 2024-12-19 05:27 GMT

భర్త మరణానంతరం మరో వివాహం చేసుకున్న భార్యకు ఆస్తిలో వాటా దక్కుతుందా? హిందూ వివాహ చట్టం ఏమి చెబుతుంది? భర్త చనిపోయిన అనంతరం ఆమె మరో వివాహం చేసుకున్న తర్వాత కూడా మొదటి భర్త ఆస్తిలో వాటా అడిగే హక్కు ఉంటుందా? ఈ ప్రశ్నలన్నింటికీ తాజాగా మద్రాసు హైకోర్టు క్లారిటీ ఇచ్చింది.

అవును... భర్త మరణానంతరం మరో వివాహం చేసుకున్న భార్యకు.. హిందూ వివాహ చట్టం ప్రకారం మొదటి భర్త ఆస్తిలో వాటా పొందేందుకు హక్కు ఉంటుందని మద్రాసు హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ హక్కు భార్యకు లేదని సేలం సివిల్ కోర్టు పిటిషన్ ను కొట్టివేయగా.. మద్రాసు హైకోర్టు మాత్రం.. ఆమెకు దక్కాల్సిన ఆస్తులను ఆమెకు అప్పగించాలని ఉత్తర్వ్యులిచ్చింది.

వివరాళ్లోకి వెళ్తే... తమిళనాడులోని సేలంకు చెందిన సేవీ గౌండర్ అనే వ్యక్తి మృతి చెందారు. అనంతరం ఆయన వారసులైన చిన్నయ్యన్, ఆయన సోదరులకు ఆస్తులు బదిలీ అయ్యాయి. ఈ క్రమంలో.. చిన్నయ్యన్ మృతి చెందారు. దీంతో... ఆయన భార్య మల్లిక రెండో వివాహం చేసుకున్నారు. ఈ సందర్భంగా చిన్నయ్యన్ ఆస్తిలో వాటా కోరారు.

ఇందులో భాగంగా... చనిపోయిన తన మొదటి భర్త చిన్నయ్యన్ ఆస్తిలో వాటా ఇవ్వాలంటూ మల్లిక సేలం సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే... ఈ పిటిషన్ ను సివిల్ కోర్టు కొట్టేసింది. దీంతో.. ఆమె మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ బుధవారం విచారణకు వచ్చింది.

ఈ సమయంలో... హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం మొదటి భర్త ఆస్తిలో వాటా అడిగేందుకు భార్యకు హక్కు ఉందని పిటిషనర్ తరుపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ సమయంలో ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తులు జస్టిస్ సుబ్రమణియన్, జస్టిస్ కుమరప్పన్ లతో కూడిన ధర్మాసనం తీర్పు వెల్లడించింది!

ఇందులో భాగంగా... భర్తను కోల్పోయిన మహిళకు ఆస్తిలో వాటా లేదని హిందూ వివాహ చట్టం చెప్పలేదని.. పునర్వివాహం చేసుకున్న మహిళకు హక్కు లేదంటూ ఉన్న హిందూ వివాహ చట్టం సెక్షన్ ను 2005లోనే రద్దు చేశారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా.. ఆమె మొదటి భర్త ఆస్తిలో ఆమెకు రావాల్సిన ఆతులను ఆమెకు అప్పగించాలని ఉత్తర్వ్యులిచ్చారు.

Tags:    

Similar News