‘బుల్డోజర్’ కూల్చివేతలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!
ఇటీవల కాలంలో వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న, నేరారోపణలు ఎదుర్కొంటున్న వారి ఇళ్లను బుల్డోజర్లతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే
ఇటీవల కాలంలో వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న, నేరారోపణలు ఎదుర్కొంటున్న వారి ఇళ్లను బుల్డోజర్లతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఎవరైనా వ్యక్తి తప్పు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సింది పోయి ఇలా నిందితుల ఇళ్లను కూల్చడం ఏమిటనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లో మొదలైన ఈ ‘బుల్డోజర్ కూల్చివేతల ట్రెండ్’ ఆ తర్వాత మధ్యప్రదేశ్. తదితర రాష్ట్రాలకు కూడా విస్తరించింది. ఒక రాష్ట్రాన్ని చూసి మరొక రాష్ట్రం ఈ విధానాన్ని అందిపుచ్చుకుంటూ ఉండటం, నిందితుల ఇళ్లు లేదా ఆస్తులను బుల్డోజర్లతో కూల్చివేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తుండటం వివాదాస్పదమవుతోంది.
ఈ నేపథ్యంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇలా బుల్డోజర్లతో నిందితుల ఇళ్లను కూల్చివేస్తున్న ఘటనలపై సుప్రీంకోర్టులో పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు ఇప్పటికే దాఖలయ్యాయి. తాజాగా ఈ పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు బుల్డోజర్ కూల్చివేతలపై హాట్ కామెంట్స్ చేసింది. ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆదేశాలతో అధికారుల నిందితుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేయడంపై అసహనం వ్యక్తం చేసింది. నిందితులయినంత మాత్రాన వారి ఇళ్లను ఎలా కూల్చివేస్తారని నిలదీసింది.
ఒక వ్యక్తి ఏదైనా కేసులో నిందితుడిగా ఉన్నంత మాత్రాన ఎలా ఇళ్లను కూల్చివేస్తారని సుప్రీంకోర్టు మండిపడింది. ఒకవేళ నిందితులు దోషులుగా తేలినా వారి ఇళ్లను కూల్చడం సరైన పద్ధతి కాదని తెలిపింది. చట్టాలు, న్యాయం ప్రకారమే నిందితులకు శిక్షలు విధించాలి తప్ప వారి ఆస్తులను కూల్చడం చట్ట విరుద్ధమని కుండబద్దలు కొట్టింది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం తాజాగా వెల్లడించింది.
సుప్రీంకోర్టు ధర్మాసనం ఘాటు వ్యాఖ్యల నేపథ్యంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందించారు. నిందితుడిగా ఉన్నారని ఆ వ్యక్తుల స్థిరాస్తులను కూల్చడంలేదని.. అవి అక్రమ కట్టడాలయితేనే వాటిని కూలుస్తున్నామని ధర్మాసనానికి నివేదించారు.
సొలిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలపై సుప్రీంకోర్టు స్పందిస్తూ.. ప్రజా రవాణా, రహదారులకు అడ్డంకిగా మారే అక్రమ కట్టడాలను కూల్చివేయొచ్చని తెలిపింది. అలాంటి వాటిని కాపాడాలని తాము సూచించడం లేదంది. అయితే, ఈ కూల్చివేతలకు సంబంధించి దేశస్థాయిలో మార్గదర్శకాలను రూపొందించాల్సి ఉందని తెలిపింది. దీనిపై ఇరు పక్షాలు తమ సూచనలు తెలియజేయొచ్చని పేర్కొంది. ఈ పిటిషన్లపై తదుపరి విచారణను సెప్టెంబర్ 17కి వాయిదా వేసింది.