ఈ సమయంలో జోక్యం చేసుకోలేం.. గ్రూప్-1పై సుప్రీం కీలక తీర్పు
ఇక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి ఇంతవరకు గ్రూప్-1 రిక్రూట్‌మెంట్ జరగలేదు. పదేళ్లుగా గ్రూప్-1 పరీక్షల కోసం అభ్యర్థులు నిరీక్షిస్తూనే ఉన్నారు.
గత పదేళ్లపాటు తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 గ్రహణం వీడలేదు. గ్రూప్-1 పోస్టుల కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడల్లా ఏదో ఒక వివాదం తెరమీదకు వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2011లో గ్రూప్-1 పరీక్షలు జరిగాయి. ఆ రిక్రూట్‌మెంట్ కూడా పూర్తయింది. ఇక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి ఇంతవరకు గ్రూప్-1 రిక్రూట్‌మెంట్ జరగలేదు. పదేళ్లుగా గ్రూప్-1 పరీక్షల కోసం అభ్యర్థులు నిరీక్షిస్తూనే ఉన్నారు.
చివరకు 2022 ఏప్రిల్ 26న స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి నోటిఫికషన్ ఇచ్చారు. మూడు సార్లు ప్రిలిమ్స్ జరిగినప్పటికీ మెయిన్స్ వచ్చే సరికి వివాదాలు వచ్చి వాయిదా పడుతూ వచ్చాయి. ఇక తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గ్రూప్-1 పరీక్షలపై ప్రత్యేక దృష్టి సారించింది. అయితే.. గ్రూప్-1లో రిజర్వేషన్ల విషయమై జీవో 29 తీసుకొచ్చింది. దీంతో మరోసారి వివాదం నెలకొంది. అభ్యర్థులు పెద్ద ఎత్తున బయటకు వచ్చి ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.
అయినప్పటికీ.. పరీక్షలు నిర్వహించేందుకు కాంగ్రెస్ గట్టి నిర్ణయంతో ఉంది. అందులో భాగంగానే ఈ రోజు నుంచి పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. అయితే.. పరీక్షలను వాయిదా వేయాలంటూ అభ్యర్థులు, ఇటు ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి. జీవో 29ను తొలగించాలని డిమాండ్ చేశారు. అయినా కూడా ప్రభుత్వం వినిపించుకోలేదు. షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు జరుగుతాయని ముఖ్యమంత్రి రేవంత్ ప్రకటించారు. అభ్యర్థులు అనవసరంగా ప్రతిపక్షాల మోసంలో పడకుండా భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం జీవో ఎత్తివేతకు, పరీక్షల వాయిదాకు నో చెప్పడంతో అభ్యర్థులంతా సుప్రీంకోర్టుకు చేరుకున్నారు. అంతకుముందే అభ్యర్థులంతా హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన హైకోర్టు ధర్మాసనం చివరి నిమిషంలో వాయిదా వేయడం కుదరదంటూ తీర్పునిచ్చింది. దీంతో వారంతా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో నిన్నటి నుంచి సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పునిస్తుందా అన్న ఉత్కంఠ కనిపించింది. ఇప్పటికే వాయిదాలు పడుతూ వస్తున్న గ్రూప్-1 మరోసారి వాయిదా పడక తప్పదా అన్న ప్రచారం జరిగింది. ఎట్టకేలకు సుప్రీంకోర్టు కూడా ఆ సస్పెన్స్‌కు తెరదించింది. గ్రూప్-1 పరీక్షలు యథావిధిగా నిర్వహించాలని తీర్పునిచ్చింది.
అభ్యర్థుల తరఫున కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. వాదనలు ముగిసిన తరువాత కోర్టు ధర్మాసనం పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. ఇంతవరకు వచ్చి ఇప్పుడు పరీక్షలు వాయిదా వేయడం సరైంది కాదని తెలిపింది. ఈ సమయంలో ఇందులో జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. రద్దు చేస్తే ఇంతవరకు అభ్యర్థులు ప్రిపేర్ అయిన సిలబస్ అంతా కూడా వ్యర్థం అవుతుందని అభిప్రాయపడింది. ఇదిలా ఉండగా.. రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-1 అభ్యర్థులు రెండు గంటల ముందే పరీక్షల కేంద్రాలకు చేరుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పుపై ఆసక్తికరంగా చూస్తున్నారు. ఎట్టకేలకు తీర్పు రావడంతో వారంతా పరీక్షలు రాసేందుకు సన్నద్ధం అయ్యారు. మరోవైపు.. ఎటువంటి అల్లర్లు జరగకుండా ముందస్తుగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.