'మహిళా వైద్యులకు నైట్ డ్యూటీ మినహాయింపు'... సుప్రీంకోర్టు సీరియస్!

నైట్ షిఫ్ట్ లలో పనిచేసే మహిళలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదని నొక్కి చెప్పారు!

Update: 2024-09-18 01:30 GMT

కోల్ కతా వైద్యురాలి ఘటనపై సుప్రీంకోర్టులో నిన్న విచారణ జరిగింది. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తీసుకొచ్చిన నోటిఫికేషన్ పై భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నైట్ షిఫ్ట్ లలో పనిచేసే మహిళలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదని నొక్కి చెప్పారు!

అవును... ప్రభుత్వ ఆస్పత్రుల్లో మహిళా వైద్యులకు నైట్ షిప్ట్ లు కేటాయించడాన్ని నిరాకరిస్తున్నామని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిపై సీజేఐ చంద్రచూడ్ మండిపడ్డారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మహిళా వైద్యులు, సిబ్బందిని రాత్రిపూట విధుల్లో నియమించొద్దని చెప్పడాన్ని తప్పుబట్టారు.

భద్రతను కల్పించడం ప్రభుత్వం విధి.. ఈ ఉత్తర్వ్యులను తక్షణం సవరించాలి అని సీజేఐ బెంగాల్ సర్కార్ కు సూచించారు. కోల్ కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన నేపథ్యంలో మహిళా వైద్యులకు నైట్ డ్యూటీలు నిషేధిస్తూ మమతా బెనర్జీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.

దీనిపై స్పందించిన సీజేఐ... మహిళలు రాత్రిపూట విధుల్లో ఉండొద్దని మీరు ఎలా చెబుతారు.. మహిళా వైద్యులకు ఎందుకు అలాంటి పరిమితులు అని ప్రశ్నిస్తూ... వాళ్లు ఎలాంటి మినహాయింపులూ కోరుకోవడం లేదని, నైట్ డ్యూటీలు చేయడానికి సిద్ధంగ ఉన్నారని అన్నారు.

ఈ సమయంలో.. బెంగాల్ ప్రభుత్వం తరుపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ను ఉద్దేశించి స్పందించిన సీజేఐ... మిస్టర్ సిబల్ మీరు దానికి కచ్చితంగా చూడాలి, దానికి సమాధానంగా తప్పకుండా భద్రత ఇవ్వాలి, ఈ నోటిఫికేషన్ ను సవరించాలి, భద్రత కల్పించడం మీ కర్తవ్యం అని గుర్తించాలి, పైలట్లు, ఆర్మీ మొదలైన వారంతా రాత్రి కూడా పని చేస్తారు అని పేర్కొన్నారు!

కాగా... కోల్ కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సుమారు 40 రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆస్పత్రిలో మహిళా వైద్యులకు రక్షణ కరువైందనే ఆరోపణలు బలంగా వెల్లువెత్తుతున్నాయి. ఈ సమయంలో మహిళలకు నైట్ షిఫ్ట్ లు బంద్ చేయాలని ప్రభుత్వం నోటిఫికేషన్ తీసుకొచ్చింది!!

Tags:    

Similar News