ఆస్తి హక్కుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
అవును... చట్ట ప్రకారం తగిన నష్టపరిహారం ఇవ్వకుండా ఏ వ్యక్తి ఆస్తిని లాక్కోలేమని సుప్రీంకోర్టు పేర్కొంది.
'ఆస్తి హక్కు రాజ్యాంగ హక్కు ' అని.. చట్ట ప్రకారం తగిన నష్టపరిహారం చెల్లించకుండా ఏ వ్యక్తికి సంబంధించిన ఆస్తిని లాక్కోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఆస్తి హక్కు మానవహక్కుగా కొనసాగుతుందని.. ఆర్టికల్ 300ఏ ని ప్రస్థావిస్తూ న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, కేవీ విశ్వనాథన్ లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
అవును... చట్ట ప్రకారం తగిన నష్టపరిహారం ఇవ్వకుండా ఏ వ్యక్తి ఆస్తిని లాక్కోలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలోనే.. రాజ్యాంగ నలభై నాలుగవ సవరణ చట్టం - 1978 వల్ల ఆస్తిపై హకు ప్రాథమిక హక్కుగా నిలిచిందని.. అయితే, సంక్షేమ రాజ్యంలోని ఆర్టికల్ 300ఏ ప్రకారం ఇది మానవ హక్కుగా కొనసాగుతుందని ధర్మాసనం వెల్లడించింది.
బెంగళూరు - మైసూరు ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ ప్రాజెక్ట్ (బీ.ఎం.ఐ.సీ.పీ)కి సంబంధించిన భూసేకరణకు సంబంధించి కర్ణాటక రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం 2022 - నవంబర్ లో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం తాజాగా తీర్పు వెలువరించింది.
ఇందులో భాగంగా... ఆస్తి హక్కు ప్రాథమిక హక్కు కానప్పటికీ.. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 300ఏ ప్రకారం ఇది రాజ్యాంగ హక్కు అని బెంచ్ పేర్కొంది. ఈ నేపథ్యంలో... ఒక వ్యక్తికి చట్టం ప్రకారం తగిన పరిహారం చెల్లించకుండా అతని ఆస్తిని కోల్పోలేమని వెల్లడించింది. బీ.ఎం.ఐ.సీ.పీ.కి సంబంధించిన పరిహారంపై తన తీర్పులో ఈ విషయాన్ని పేర్కొంది.
ఈ సందర్భంగా దీనికి సంబంధించిన పూర్తి నేపథ్యాన్ని ప్రస్థావిస్తూ... 2003 జనవరిలో ఈ ప్రాజెక్ట్ కోసం భూములను సేకరించేందుకు కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియాస్ డెవలప్ మెంట్ బోర్డ్ (కేఐఎడీబీ) ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేయగా.. 2005 నవంబర్ లో పిటిషనర్ భూమిని స్వాధీనం చేసుకున్నట్లు ధర్మాసనం పేర్కొంది.
ఈ క్రమంలో గత 22 సంవత్సరాలలో పలు సందర్భాల్లో భూయజమానులు కోర్టుల తలుపులు తట్టాల్సి వచ్చిందని.. ఎలాంటి పరిహారం చెల్లించకుండా వారి ఆస్తులను లాక్కున్నారని.. నష్టపరిహారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం / కేఐఎడీబీ అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగానే అప్పీలుదారులకు పరిహారం అందకుండా పోయిందని తెలిపింది.
ఈ నేపథ్యంలో సేకరించిన భూమి మార్కెట్ విలువను నిర్ణయించడానికి 2011లో ఉన్న మార్గదర్శక విలువలను తీసుకుని, 2019 ఏప్రిల్ 22న పరిహారం నిర్ణయించారని ధర్మాసనం పేర్కోంది. 2003 నాటి మార్కెట్ విలువ ప్రకారం ఇవ్వాల్సిన పరిహారాన్ని అనుమతించినట్లైతే అది న్యాయాన్ని అపహాస్యం చెసినట్లేనని తెలిపింది.
ఈ సందర్భంగా.. సుమారు 22 ఏళ్లుగా పిటీషనర్ తమ చట్టబద్ధమైన బకాయిలను కోల్పోయారని.. భూసేకరణ విషయంలో ధరను నిర్ణయించడం, పరిహారం పంపిణీ చేయడం చాలా ముఖ్యమని ధర్మాసనం స్పష్టం చేసింది.