ఉచిత హామీల కేసులో కీలక పరిణామం.. నోటీసులు జారీ చేసిన సుప్రీం

ఎలా అయినా అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఎన్నికల ముంగిట పార్టీలు అమలు సాధ్యంకాని హామీలు గుప్పిస్తుంటాయి.

Update: 2024-10-15 09:29 GMT

ఎలా అయినా అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఎన్నికల ముంగిట పార్టీలు అమలు సాధ్యంకాని హామీలు గుప్పిస్తుంటాయి. ప్రత్యర్థి పార్టీతో పోటీపడుతూ మరీ హామీలు ఇస్తుంటాయి. అధికారంలోకి వచ్చాక వాటిని కొన్నింటిని అమలు చేసి.. మరికొన్నింటిని మరుగునపడేస్తాయి. నిధులు పెద్ద మొత్తంలో కావాల్సి వస్తుందన్న ఉద్దేశంతో ఇక వాటి ప్రస్తావన కూడా తీసుకురావు. మరోవైపు.. ఈ ఉచిత హామీలతో ప్రజలను మరింత సోమరులను చేస్తున్నారనే వాదన కూడా ఉంది.

ఉచిత పథకాలు ప్రకటించడం వల్ల కుటుంబాల్లో సమస్యలు వస్తున్నాయన్న అభిప్రాయాలూ వినిపించాయి. జనాలను పనులు చేసుకోకుండా సోమరిపోతులను చేస్తున్నారంటూ ఎన్నో విమర్శలు ఉన్నాయి. ప్రజలు జీవించడానికి, పనిచేసుకునేందుకు ఉపాధి కల్పించాలంటూ కోరిన సందర్భాలూ ఉన్నాయి. ప్రజల నుంచి కూడా ఆ డిమాండ్‌ను చాలా సందర్భాల్లో విన్నాం. ఉచితాల ద్వారా ప్రజాధనం వృథా అవుతోందని కోర్టు మెట్లెక్కారు.

అయితే.. పార్టీల హామీలపై ఇప్పటికే సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీలను లంచాలుగా పరిగణిస్తూ ఆదేశాలివ్వాలన్న పిటిషన్ కూడా సుప్రీంకోర్టులో పడింది. దీనిపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.

ఉచిత హామీలను లంచాలుగా పరిగణించాలని దాఖలైన పిల్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కేంద్రం, ఈసీఐకి నోటీసులు జారీచేసింది. ఇదే అంశం మీద గతంలో నమోదైన పెండింగ్ కేసులను సైతం జతపరిచింది. రాజకీయ పార్టీలు ఉచిత హామీలు ఇవ్వకుండా పటిష్ట చర్యలు తీసుకునే ఈసీఐకి ఆదేశాలివ్వాలని పిటిషన్‌దారులు సుప్రీంకోర్టును కోరారు. ఈ క్రమంలో విచారణ చేపట్టి నోటీసులు జారీ చేసింది.

Tags:    

Similar News