సార్వత్రిక ఎన్నికల్లో నోటా గెలిస్తే.. ఈసీకి సుప్రీం నోటీసులు
ఎన్నికలు ఏదైనా.. బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరూ నచ్చని వేళ.. ఓటరు తన ఓటును ఎవరికి వేయకూడదన్న నిర్ణయాన్ని నోటా ద్వారా తెలియజేసే అవకాశాన్ని ఇవ్వటం తెలిసిందే.
ఎన్నికలు ఏదైనా.. బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరూ నచ్చని వేళ.. ఓటరు తన ఓటును ఎవరికి వేయకూడదన్న నిర్ణయాన్ని నోటా ద్వారా తెలియజేసే అవకాశాన్ని ఇవ్వటం తెలిసిందే. తాజాగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల వేళలో.. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంలో ఆసక్తికర ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఒకటి దాఖలైంది. దీని సారాంశం ఏమంటే.. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు అందరికంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఏం చేయాలి? ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? విజేతగా ఎవరిని నిలపాలి? అలాంటివేళ.. ఈసీ చర్యలేంటి? లాంటి ప్రశ్నలకు సమాధానాలు కోరుతూ సుప్రీంలో పిటిషన్ దాఖలైంది.
ఈ ప్రశ్నల్లో లాజిక్ ఉండటంతో పాటు.. నోటా గెలిస్తే తదుపరి చర్యలు ఏమిటన్న దానిపై నెలకొన్న సందేహాలకు సమాధానాలు అవసరమంటూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఎన్నికల్లో నోటా గెలిస్తే పోటీలో ఉన్న అభ్యర్థులందరూ ఐదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిర్ణయం తీసుకోవటంతో పాటు.. సదరు నియోజకవర్గ ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ రచయిత.. వ్యక్తిత్వ వికాసం.. కెరీర్ గైడెన్స్ మీద పుస్తకాలు రాసే శివ్ ఖేడా తన పిటిషన్ ను సుప్రీంలో దాఖలు చేశారు.
ఆయన పిటిషన్ ను పరిశీలించిన సుప్రీంకోర్టు.. ఆయన లేవనెత్తిన అంశాలపై వివరణ కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. పిల్ ద్వారా లేవనెత్తిన అంశాలపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్.. జస్టిస్ జేబీ పార్దీవాలా.. జస్టిస్ మనోజ్ మిశ్ర ధర్మాసనం అంగీకరించింది. నోటా కంటే తక్కువ ఓట్లు పొందిన అభ్యర్థులు.. తర్వాతి ఐదేళ్ల పాటు నిర్వహించే ఏ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలన్న కీలక అంశాన్ని ఆయన తెర మీదకు తీసుకొచ్చారు. అంతేకాదు.. నోటాను కల్పిత అభ్యర్థిగా ప్రచారం చేయాలన్న డిమాండ్ తో పాటు.. ఈ అంశాలకు తగిన నిబంధనల్ని రూపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఈ పిటిషన్ వేళ.. అసలు నోటా ఎంట్రీ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. 2013లో పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ సంస్థ వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై వెలువరించిన తీర్పుతోనే నోటా ఎన్నికల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరూ నచ్చనప్పుడు నోటా మీటను నొక్కటం ద్వారా.. బరిలో ఉన్న అభ్యర్థులపై తనకున్న అసంత్రప్తిని ఓటరు వ్యక్తం చేయొచ్చు. అయితే.. మిగిలిన అభ్యర్థుల కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే.. ఆ తర్వాత ఎక్కువ ఓట్లు వచ్చిన వ్యక్తిని విజయం సాదించినట్లుగా నిర్ణయిస్తారు. అయితే.. ఈ నిర్ణయం సరికాదన్నది పిటిషన్ వాదన. మరి.. దీనిపై ఈసీ ఏమని చెబుతుందో చూడాలి.