మంత్రిని తొలగించే అధికారం గవర్నర్ కు లేదు.. తేల్చిన సుప్రీం
రవాణా శాఖలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి భారీగా సొమ్ము వసూలు చేశారంటూ మంత్రి సెంథిల్ బాలాజీ మీద తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.
ఒక రాష్ట్ర మంత్రి మీద ఆరోపణలు వచ్చినంత మాత్రాన ఆయనపై వేటు వేసే అధికారం గవర్నర్ కు లేదన్న విషయాన్ని స్పష్టంగా చెప్పేసింది దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీని మంత్రిపదవి నుంచి తొలగిస్తూ తమిళనాడు రాష్ట్ర గవర్నర్ తీసుకున్న నిర్ణయం సరికాదని.. ఆయనకు ఆ అధికారం లేదని సుప్రీం పేర్కొంది. రాష్ట్ర మంత్రివర్గసిఫార్సు ఆధారంగానే గవర్నర్ వ్యవహరించాలని.. గవర్నర్ కు తనకు తానుగా వేటు వేసే అధికారం లేదని సుప్రీం ధర్మాసనం తేల్చింది.
రవాణా శాఖలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి భారీగా సొమ్ము వసూలు చేశారంటూ మంత్రి సెంథిల్ బాలాజీ మీద తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. వీటిపై ఈడీ అధికారులు సైతం ఆయన్ను గత ఏడాది జూన్ 13న అరెస్టు చేవారు. ఈ నేపథ్యంలో సెంథిల్ ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేస్తూ రాష్ట్ర గవర్నర్ నిర్ణయాన్ని ప్రకటించారు. ఇదిలా ఉండగా.. గవర్నర్ ఆదేశాల్ని అమలుపై న్యాయవాది ఎంఎల్ రవి మద్రాస్ హైకోర్టులోనూ.. తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అరెస్టు అయిన మంత్రి సెంథిల్ బాలాజీని మంత్రిగా ఎలా కొనసాగిస్తారంటూ ప్రశ్నించారు.
అయితే.. ఈ పిటిషన్ ను విచారణకు మద్రాసు హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదు. దీంతో.. దీన్ని సుప్రీంలో సవాలు చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రాథమికంగా పరిశీలిస్తే హైకోర్టు తీరు సరైనదన్న సుప్రీం.. ‘ఒక రాష్ట్ర గవర్నర్ తనకు తానుగా మంత్రిని బర్తరఫ్ చేయలేరు. రాష్ట్ర మంత్రివర్గం చేసే సిఫార్సులకు అనుగుణంగా మాత్రమే గవర్నర్ వ్యవహరించాలి’’ అని తేల్చేయటం ద్వారా.. గవర్నర్ పరిధి.. పరిమితులు ఏమిటన్నది మరోసారి స్పష్టమైందని చెప్పాలి.