జగన్ కి ప్రతిపక్ష హోదా...కౌంటర్ దాఖలుకు హైకోర్టు ఆదేశం
అయితే ఆ పిటిషన్ మేరకు రాష్ట్ర శాసనసభ కార్యదర్శి, స్పీకరు కార్యదర్శులకు కౌంటర్లు దాఖలు చేయాలని కోరుతూ తాజాగా హైకోర్టు ఆదేశించింది.
ఏపీలో ఇపుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ తన ఎమ్మెల్యేలతో అసెంబ్లీకి హాజరయ్యేది లేదని తేల్చి చెప్పడంతో అది ఒక హాట్ డిబేట్ ఇష్యూగా మారిపోయింది. జగన్ అసెంబ్లీకి రాకపోవడం కూటమి ప్రభుత్వం మీద ఒత్తిడిగా పనిచేస్తోందా అంటే పట్టించుకోకూడదనే ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. అదే సమయంలో కూటమిలోని మంత్రులు మాత్రం జగన్ అసెంబ్లీకి గైర్ హాజరు కావడాన్ని తప్పు పడుతున్నారు. హోంమంత్రి అనిత అయితే సింహం సింగిల్ అంటే ఏంటో కొత్త డెఫినిషన్ చెప్పారు
తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను అందరినీ సస్పెండ్ చేసినా చంద్రబాబు ఒక్కరే గత అసెంబ్లీ సెషన్ లో హాజరై వైసీపీ సర్కార్ కి సవాల్ గా నిలిచారు అని ఆమె గుర్తు చేశారు. అంటే జగన్ అసెంబ్లీకి 11 మందితో కూడా కలసీ రాలేకపోతున్నారు అని ఆమె సెటైర్లు వేశారు అన్న మాట.
మరో వైపు చూస్తే తనకు శాసనసభలో వైసీపీ ఏకైక ప్రతిపక్షంగా ఉందని, అందువల్ల తనకు ప్రతిపక్ష నేత హాదా ఇచ్చేలా స్పీకర్‌కు ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ వైసిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి విధితమే.
అయితే ఆ పిటిషన్ మేరకు రాష్ట్ర శాసనసభ కార్యదర్శి, స్పీకరు కార్యదర్శులకు కౌంటర్లు దాఖలు చేయాలని కోరుతూ తాజాగా హైకోర్టు ఆదేశించింది. గతంలో ఇచ్చిన గడువు ముగియడంతో ఈసారి నాలుగు వారాల గడువు మంజూరు చేస్తూ జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారని తెలుస్తోంది.
ఇక చూస్తే తనకు అన్ని విధాలా చట్ట ప్రకారం శాసనసభలో ప్రతిపక్షనేత హోదా దక్కుతుందని జగన్ పిటిషన్ లో పేర్కొన్నారు ఈ మేరకు శాసనసభ కార్యదర్శి, స్పీకరు కార్యదర్శిని ఆదేశించాలంటూ జగన్ పిటిషన్ లో కోరారు. అయితే నాలుగు వారాల గడువు ఉన్నందువల్ల స్పీకర్ కార్యదర్శి, అసెంబ్లీ కార్యదర్శి ఏ విధంగా కౌంటర్ దాఖలు చేస్తారో చూడాల్సి ఉంది.
మరో వైపు చూస్తే చట్టంలో ఎక్కడా పది శాతం సభ్యులు ఉండాలని నిబంధన ఏదీ లేదని వైసీపీ వాదిస్తోంది. పైగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ రాజకీయ పక్షం ఉంటుందో అదే విపక్షంగా ఉంటుందని నిబంధనలు సూచిస్తున్నాయని అంటున్నారు. అయితే నిబంధలను విషయం అలా ఉంచితే సభ సంప్రదాయాలను అనుసరించి ఇప్పటిదాకా అమలు అవుతున్నది మాత్రం మొత్తం శాసన సభలో పది శాతం మంది సభ్యులు ఉండాలన్న దానినే అంటున్నారు. సో ఈ విషయంలో ఏమి జరుగుతుంది అన్నది ఒక ఆసక్తిని గొలిపే అంశంగానే అంతా చూస్తున్నారు.