నాగార్జున కుటుంబం క్షోభించింది.. సురేఖ శిక్షార్హురాలు.. కోర్టులో వాదనలు
అయితే.. నాగార్జున వేసిన పిటిషన్‌పై ఈ రోజు నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది.
గతంలో మంత్రి కొండా సురేఖ కేటీఆర్ మీద చేసిన వ్యాఖ్యలు పెను దుమారమే రేపాయి. కేటీఆర్‌ను విమర్శిస్తూనే ఆమె సినీనటుడు నాగార్జున ఫ్యామిలీని కూడా ప్రస్తావనకు తీసుకొచ్చారు. దాంతో ఆమె వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. ఇటు రాజకీయంగానూ.. అటు సినీ పరిశ్రమలోనూ ఆమె వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున ఖండనలు వచ్చాయి. చాలా మంది సురేఖ వ్యాఖ్యలను తప్పుపట్టారు.
కేటీఆర్ హీరోయిన్ల జీవితాలతో ఆడుకుంటున్నాడని సంచలన ఆరోపణలు చేశారు సురేఖ. వారికి డ్రగ్స్ అలవాటు చేసింది కూడా కేటీఆరే అని.. కేటీఆర్‌కు తల్లి, అక్క, చెల్లి లేరా అంటూ నిలదీశారు. అంతటితో ఆగకుండా.. నాగచైతన్య-సమంత విడిపోవడానికి కారణం కూడా కేటీఆర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. అంతకుముందు నాగార్జున ఆమె వ్యాఖ్యలను ఖండించారు. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను, మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోకండి అని కోరారు. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు సైతం అబద్ధమని పేర్కొన్నారు. తక్షణమే సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరారు. ఇక.. సురేఖ కామెంట్స్‌ను సీరియస్‌గా తీసుకున్న సినీనటుడు నాగార్జున వెంటనే కోర్టును ఆశ్రయించారు. నాంపల్లి కోర్టును ఆశ్రయించి క్రిమినల్ పిటిషన్ దాఖలు చేశారు.
తన వ్యాఖ్యలపై కొండా సురేఖ సైతం స్పందించారు. అనుకోని సందర్భంలో అనుకోకుండా ఓ కుటుంబంపై వ్యాఖ్యలు చేశానని, వాటిని వెనక్కి తీసుకుంటున్నానని చెప్పారు. కేటీఆర్ తనను కించపరిచేలా మాట్లాడారని, ఆ మాటలతో వేదనకు గురై ఆయన గురించి వ్యాఖ్యలు చేసే క్రమంలో అనుకోకుండా నాగార్జున కుటుంబం గురించి మాట్లాడాల్సి వచ్చిందని తెలిపారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని పేర్కొన్నారు. కానీ.. కేటీఆర్‌పై మాత్రం తగ్గేది లేదని స్పష్టం చేశారు.
అయితే.. నాగార్జున వేసిన పిటిషన్‌పై ఈ రోజు నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ప్రొసీజర్ ప్రకారం పిటిషనర్ వాంగ్మూలాన్ని న్యాయంస్థానం రికార్డు చేసింది. నాగార్జునతోపాటు సాక్షుల స్టేట్‌మెంట్లను రికార్డు చేసింది. అయితే.. ఇదే కేసులో క్రిమినల్ ప్రొసీజర్‌తోపాటు సురేఖ మీద నాగార్జున పరువునష్టం దావా కూడా వేశారు. దీనిపై ఇప్పటికే సురేఖ కూడా కౌంటర్ దాఖలు చేశారు. సురేఖ తరఫు న్యాయవాది ఈ రోజు వాదనలు వినిపించారు.
కొండా సురేఖ నాగార్జునపై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారని, కానీ ఆ తర్వాత వెంటనే ట్విట్టర్‌లో క్షమాపణ కోరుతూ పోస్ట్ చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సురేఖ పెట్టిన పోస్టును నాగార్జున తరఫు న్యాయవాది అశోక్ రెడ్డి చదివి వినిపించారు. మంత్రి పదవిలో ఉంది ఇలాంటి కామెంట్స్ చేయడం సరైంది కాదని.. ఖచ్చితంగా సురేఖ క్రిమినల్ చర్యలకు అర్హురాలని, ఆమె వ్యాఖ్యలతో నాగార్జున, ఆయన కుటుంబం మానసికంగా కుంగిపోయారని తెలిపారు.