విచారణకు ఓకే.. చర్యలు వద్దు.. హైడ్రా ఫిర్యాదులపై హైకోర్టు
ఇందులో భాగంగా ఇప్పటికే తాము కూల్చేసిన కట్టడాల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై హైడ్రా ఇప్పటికే సైబరాబాద్ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వటం తెలిసిందే.
చెరువుల భూముల్లో నిర్మించే నిర్మాణాల విషయంలో హైడ్రా అలియాస్ హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ అథారిటీ చేపట్టిన చర్యలు.. కూల్చివేతలు ఎంతటి సంచలనంగా మారాయో తెలిసిందే. అక్రమ నిర్మాణంఅయితే చాలు.. మరో ఆలోచన లేకుండా అడ్డంగా కూల్చేసే ఈ వ్యవస్థ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అక్రమ నిర్మాణాన్ని కూల్చేయటమే కాదు.. ఆ నిర్మాణానికి కారణమైన అధికారులపై చర్యల దిశగా అడుగులు వేయటం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే తాము కూల్చేసిన కట్టడాల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై హైడ్రా ఇప్పటికే సైబరాబాద్ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వటం తెలిసిందే.
హైడ్రా కంప్లైంట్ల మీద కేసులు ఎదుర్కొంటున్న అధికారుల్లో కొందరు హైకోర్టును ఆశ్రయించారు. వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని.. విచారణ చేయొచ్చంటూ సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగాన్ని ఆదేశిస్తూ ఇద్దరు అధికారులకు హైకోర్టు ఊరటను ఇచ్చింది. బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 35(3) కింద నోటీసులు జారీ చేయాలని.. నిందితులైన అధికారుల వాదనను వినాలని స్పష్టం చేసింది.
సైబరాబాద్ కమిషనరేట్ పరిదిలోని వివిధ ప్రాంతాల్లో చెరువుల్లో అక్రమ నిర్మాణాల్ని ప్రోత్సహించినందుకు ఆరుగురు అధికారులపై ఆగస్టు 30న హైడ్రా కమిషనర్ రంగనాథ్ కంప్లైంట్ చేశారు. ఎర్రకుంట చెరువు విస్తీర్ణం 3.033 ఎకరాలు ఉండగా.. తప్పుడు జియో కోఆర్డినేట్ ల ఆధారంగా అనుమతులు మంజూరు చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ అధికారులపై చర్యలకు వీలుగా సైబరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు. అధికార దుర్వినియోగం తదితర సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ చేర్చింది.
ఈ కేసుల్ని కొట్టేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు మేడ్చల్ సర్వే అండ్ ల్యాండ్స్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు.. బాచుపల్లి తహసీల్దార్ పూల్ సింగ్ పిటిషన్ దాఖలు చేశారు. వీరి పిటీషన్లను విచారణకు అంగీకరించిన ధర్మాసనం విచారణకు అభ్యంతరం లేదని.. బలవంతపు చర్యలు మాత్రం చేపట్టొద్దని ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసు తదుపరి విచారణలో మరిన్ని ఆదేశాలు జారీ కానున్నాయి.