11 ఏళ్ల క్రితం కేసులో యావజ్జీవ శిక్ష.. తాజాగా హైకోర్టు నిర్దోషిగా తీర్పు కట్ చేస్తే?

న్యాయం జరగటం ముఖ్యం. కానీ.. సకాలంలో జరగాల్సిన అవసరం ఉంది. అందుకు భిన్నంగా చోటు చేసుకునే పరిణామాలు అన్యాయమే అవుతుంది

Update: 2024-08-05 05:01 GMT

న్యాయం జరగటం ముఖ్యం. కానీ.. సకాలంలో జరగాల్సిన అవసరం ఉంది. అందుకు భిన్నంగా చోటు చేసుకునే పరిణామాలు అన్యాయమే అవుతుంది. అలాంటి ఒక షాకింగ్ ఉదంతం తాజాగా వెలుగు చూసింది. తల్లిని హత్య చేసిన కేసులో అరెస్టు అయిన కొడుక్కి కొర్టు యావజ్జీవ శిక్షను వేస్తే.. తెలంగాణ హైకోర్టు నిర్దోషిగా తేల్చింది. చేయని నేరానికి 11 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్నాడని.. ఇప్పటికైనా న్యాయం జరిగిందని భావిస్తున్న వేళ.. సదరు వ్యక్తి మరణించి ఆరేళ్లు అయ్యిందన్న సత్యం తాజాగా వెలుగు చూసి షాకిస్తోంది. మరి.. ఇన్నేళ్లు ఏం జరిగినట్లు? అన్నది ప్రశ్న. కోర్టులో వాదనలు వినిపించిన న్యాయవాదులకు సైతం అతడు చనిపోయిన విషయంపై సమాచారం లేకపోవటమే దీనికి కారణంగా చెబుతున్నారు. విన్నంతనే అయ్యో అనిపించే ఈ ఉదంతంలోకి వెళితే..

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండవెల్లి గ్రామానికి చెందిన పోచయ్య మీద తన తల్లి ఎల్లవ్వను హత్య చేశారన్న నేరంపై 2013లో అరెస్టు అయ్యారు. పెద్దవయస్కురాలైన తల్లిని పోషించలేక ఆమెను చెట్టుకు టవల్ లో ఉరి వేసి చంపినట్లుగా ఆరోపణలు చేస్తూ కోర్టు అభియోగపత్రాన్ని దాఖలు చేశారు పోలీసులు. ఈ ఉదంతంలో పోచయ్యకు సిద్దిపేట కోర్టు 2015 జనవరి 12న యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తూ తీర్పును ఇచ్చారు. దీంతో అతన్ని చర్లపల్లి జైలుకు తరలించారు.

అయితే.. పోచయ్య చిన్న కొడుకు తన తండ్రి తప్పు చేయలేదని పేర్కొంటూ హైకోర్టులో అప్పీలు దాఖలు చేశాడు. బెయిల్ పిటిషన్ వేయగా.. హైకోర్టు దాన్ని కొట్టేసింది. మొత్తంగా ఈ ఏడాది జులైలో ఈ అప్పీలుపై విచారణ జరిపిన హైకోర్టు పోచయ్యను నిర్దోషిగా తేలుస్తూ తక్షణం విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో బయటకు వచ్చిన నిజం ఏమంటే.. పోచయ్య చనిపోయి ఆరేళ్లు అయ్యిందని. మరి.. ఈ సమాచారం కుటుంబ సభ్యులకు తెలీదా? కేసు వాదించిన లాయర్లకు తెలీదా? అన్నది ప్రశ్నగా మారింది.

చర్లపల్లి ఓపెన్ జైలులో శిక్ష అనుభవిస్తున్న పోచయ్య 2018 ఆగస్టు 15న అనారోగ్యానికి గురి కాగా.. పోలీసులు అతడ్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. 16న కుటుంబ సభ్యులు జైలుకు చేరుకోగా.. అప్పటికే మరణించినట్లుగా జైలు సిబ్బంది చెప్పారు. చికిత్స అందించే విషయంలో జైలు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లుగా పోచయ్య చిన్న కొడుకు దావిద్ కుషాయగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పదేళ్లకు పైబడిన కేసులను పరిష్కరించాలన్న లక్ష్యంతో హైకోర్టు ఇటీవల ప్రత్యేక విచారణ చేపట్టింది. ఇందులో పోచయ్య అప్పీలుపై విచారణ జరిపిన ధర్మాసనం.. సాక్ష్యులెవరు అప్పీలుదారుకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యం చెప్పలేదు. ఈ నేపథ్యంలో కేవలం డాక్టరు.. దర్యాప్తు అధికారి సాక్ష్యాల ఆధారంగా కింది కోర్టు తీర్పును ఇవ్వటం సరికాదంటూ టీహైకోర్టు తీర్పును ఇచ్చింది. సాధారణంగా జైలులో ఖైదీ చనిపోయినప్పుడు సాధారణంగా ఆ సమాచారాన్ని జైలు అధికారులు సెషన్స్ కోర్టుకు అందజేస్తారు. కానీ..పోచయ్య ఉదంతంలో ఇలాంటి పని జరగలేదు.

కేసు విచారణలో ఉండగా అప్పీలుదారు మరణిస్తే ఆ విషయాన్ని నమోదు చేసి.. హైకోర్టు విచారణను ముగిస్తారు. పోచయ్య మరణంతో ఆయన కుటుంబ సభ్యులు అప్పీలును పట్టించుకోవటం మానేశారు. వారు ఏర్పాటు చేసుకున్న లాయర్ కూడా చనిపోయారు. పోచయ్య మరణంపై హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆఫీసుకు ఎలాంటి సమాచారం రాలేదు. దీంతో.. తన ముందున్న ఆధారాలతో వాదనలు వినిపించారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన ధర్మాసనం తీర్పును ఇచ్చింది. చనిపోయిన ఖైదీల కేసులకు సంబంధించిన వివరాలు జైలు అధికారుల వద్ద ఉంటాయని.. మరణించిన సమాచారాన్ని ప్రాసిక్యూటర్ ఆఫీసుకు అందజేస్తే ఇలాంటి ఘటనలకు అవకాశం ఉండదు. కానీ.. అదేమీ జరగకపోవటంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. వ్యవస్థల మధ్య ఉన్న గ్యాప్ ఎంతన్నది ఈ ఇన్సిడెంట్ స్పష్టం చేస్తుందని చెప్పాలి.

Tags:    

Similar News