సంచలన తీర్పు.. శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి ఏడాదిన్నర జైలు
ఉమ్మడి రాష్ట్రంలో అత్యంత సంచలనం రేపిన శిరోముండనం కేసులో సంచలనాత్మక తీర్పు వెలువడింది
ఉమ్మడి రాష్ట్రంలో అత్యంత సంచలనం రేపిన శిరోముండనం కేసులో సంచలనాత్మక తీర్పు వెలువడింది. అప్పటి టీడీపీ నేత, ఇప్పటి వైసీపీ ఎమ్మెల్సీకి ఏడాదిన్నర జైలు శిక్ష విధించింది. కుల పరంగా సున్నితమైన కోనసీమ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఉదంతం 28 ఏళ్ల కిందట టీడీపీ అధికారంలో ఉండగా జరిగింది. అప్పట్లోనే దేశవ్యాప్తంగానూ కలకలం రేపింది. ఉమ్మడి ఏపీలో తీవ్ర సంచలనం రేపిన ఈ ఘటన 1996లో జరిగింది. దీనికి సంబంధించి విశాఖపట్నం కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది.
నాడు ఏం జరిగింది?
1996 డిసెంబరు 29న ప్రస్తుత కోనసీమ జిల్లా, అప్పటి తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో ఐదుగురు దళితులను హింసించి ఇద్దరికి శిరోముండనం చేశారు. ఈ కేసులో ప్రస్తుతం వైకాపా ఎమ్మెల్సీగా, మండపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న తోట త్రిమూర్తులు నిందితుడిగా ఉన్నారు. అప్పట్లో ఆయన టీడీపీలో ఉండేవారు. ఇక ఈ కేసు 28 ఏళ్లపాటు విచారణ జరిగింది. 148 సార్లు వాయిదా పడింది. కాగా, శిరోముండనం కేసు వ్యవహారాన్ని దళిత సంఘాలు, ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండించాయి.
ఇప్పుడు ఏం జరిగింది..
28 ఏళ్లుగా సాగుతున్న కేసులో మంగళవారం విశాఖపట్టణం కోర్టు తీర్పు చెప్పింది. తోట త్రిమూర్తులుకు 18 నెలల జైలు శిక్షతో పాటు రూ.2.50 లక్షల జరిమానా విధించింది. కాగా, నాడు టీడీపీలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కీలక నేతగా వ్యవహరించిన త్రిమూర్తులు కొన్నేళ్ల కిందట వైసీపీలో చేరారు. ఎమ్మెల్సీ అయ్యారు. ఇప్పుడు ఎమ్మెల్యేగానూ పోటీచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ రెండు పార్టీలు కోర్టు తీర్పుపై ఎలా స్పందిస్తాయో చూడాలి.