సంపన్నుల సంపద ఎలా పెరుగుతుందో చెప్పిన రిపోర్టు
ఎవరెన్నిచెప్పినా డబ్బులున్నోడికి మరిన్ని డబ్బులు.. కష్టాలున్నోడికి కష్టాలు కలిసి కట్టుగా వచ్చి పడుతుంటాయి
ఎవరెన్నిచెప్పినా డబ్బులున్నోడికి మరిన్ని డబ్బులు.. కష్టాలున్నోడికి కష్టాలు కలిసి కట్టుగా వచ్చి పడుతుంటాయి. ఫైనాన్స్ విషయంలో మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా.. సంపన్నుల మాటేమిటి? సంపన్నుల తమ పెట్టుబడులు దేని మీద పెడతారు? వారి ఆస్తుల లెక్కలు ఎలా ఉంటాయి? తమ సంపదను మరింత పెంచుకోవటానికి వారేం చేస్తుంటారు? లాంటి ఎన్నో ఆసక్తికర అంశాల్ని ప్రముఖ స్థిరాస్తి కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఒక నివేదికను సిద్ధం చేసింది. అందులో ఆసక్తికర అంశాల్ని పేర్కొంది.
సంపాదించే డబ్బుల్లో కొంత భాగాన్ని పొదుపు చేయటం అందరూ చేసే పని అయినప్పటికీ.. ఇందులో మధ్యతరగతి వారితో పోలిస్తే సంపన్నుల తీరు కాస్త భిన్నంగా ఉంటుంది. ఈ వివరాల్ని తాజా రిపోర్టు వెల్లడించింది. దేశంలోని అల్ట్రా హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్స్ కు సంబంధించి.. వారి పెట్టుబడుల లెక్కలే వేరుగా ఉంటాయని తేల్చారు. ఇంతకూ వీరిని ఏ ప్రాతిపదికన తీసుకున్నారన్న విషయంలోకి వెళితే.. దాదాపు రూ.250 కోట్లు.. అంతకంటే ఎక్కువగా నికర విలువ కలిగిన ఆస్తులన్న వ్యక్తుల్ని పరిశీలించారు. వారు తమ సంపదలో 32 శాతం మొత్తాన్ని స్థిరాస్తి పైనే పెట్టుబడులు పెడుతున్నారు.
సగటున ఒక్కో సంపన్నుడు 2.57 ఇళ్లను కలిగి ఉన్నట్లుగా గుర్తించారు. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. తమకు అదనంగా ఉన్న ఇళ్లను 2023లో 28 శాతం మంది సంపన్నులు అద్దెకు ఇచ్చినట్లుగా గుర్తించారు. 2024లో 12 శాతం సంపన్నులు కొత్త ఇంటిని కొనుగోలు చేశారు. ఇంతే మంది గత ఏడాదిలోనూ కొత్త ఇంటిని తీసుకోవటం గమనార్హం.
ప్రపంచంలోని టాప్ 10 విలాసవంతమైన ఇళ్ల మార్కెట్లలో ముంబయి చోటు సంపాదించింది. ఈ జాబితాలో మొదటి స్థానంలో మనీలా ఉండగా.. తర్వాతి స్థానంలో దుబాయ్ ఉంది. తర్వాతి స్థానాల్లో బహమాస్.. అల్గేర్వ్.. కేప్ టైన్ లు ఉన్నాయి. 2022లో ఢిల్లీ 77వ ర్యాంకులో ఉండగా.. తాజాగా 37వ స్థానానికి చేరుకుంది. బెంగళూరు నగరం సైతం 63వ స్థానం నుంచి 59కు చేరుకుంది. అమెరికాలో పోలిస్తే ఆసియా పసిఫిక్ బలంగా ఉందన్న విషయాన్ని పేర్కొన్నారు.
రానున్న ఐదేళ్లలో 50 శాతం సంపన్నులు పెరుగుతారని నివేదిక అంచనా వేసింది. గత ఏడాది 13,263 మంది సంపన్నులు ఉంటే.. అంతర్జాతీయంగా 6.26 లక్షల మంది ఉన్నారు. 2022తో పోలిస్తే దేశంలోని సంపన్నుల సంఖ్య 2023 నాటికి పెరిగింది. 2022తో పోలిస్తే 2023లో 6 శాతం భారత్ లో సంపన్నుల సంఖ్య పెరగ్గా.. రానున్న ఐదేళ్లలో అంటే 2028 నాటికి వీరి సంఖ్య 50.1 శాతం పెరుగుతుందన్న అంచనాల్ని నైట్ ఫ్రాంక్ వేసింది.
2024లో తమ సంపద పెరుగుతుందని సంపన్నుల్లో 90 శాతం మంది భావిస్తున్నట్లు పే్కొంది. సంపన్నుల సంఖ్య వ్రద్ధిలో తుర్కియే 9.7 శాతంతో అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాత అమెరికా 7.9 శాతం.. భారత్ 6.1 శాతం.. దక్షిణ కొరియా 5.6 శాతం.. స్విట్జర్లాండ్ 5.2 శాతం ఉన్నట్లుగా పేర్కొంది. అంతర్జాతీయంగా చూస్తే వచ్చే ఐదేళ్లలో 28.1 శాతం పెరుగుదల ఉంటుందని అంచనా వేసింది.
సంపన్నులు తమ పెట్టుబడులు పెట్టే అంశాల్లో 17 శాతం విలాస వస్తువులపై వెచ్చిస్తున్నారని.. వాచీలు..కళాఖండాలు.. ఆభరణాలపై ఖర్చు చేస్తున్నట్లు పేర్కొంది. క్లాసిక్ కార్లు.. లగ్జరీ హ్యాండ్ బాగ్ లు.. వైన్.. అరుదుగా లభించే విస్కీ.. ఫర్నీచర్.. వజ్రాలు.. నాణేలు ఈ జాబితాలో ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ట్రెండ్ చూస్తే విలాస వాచీలు మొదటి స్థానంలో ఉంటే.. క్లాసిక్ కార్లు రెండో స్థానంలో ఉన్నట్లుగా పేర్కొన్నారు.