అమెరికా ఎన్నికల్లో ‘భారతీయం’... నెలకొల్పిన సరికొత్త రికార్డ్స్ ఇవే!

ఈ ఎన్నికల్లో భారతీయ అమెరికన్లు సత్తా చాటారు. ఇందులో భాగంగా... ప్రతినిధుల సభకు ఈసారి ఆరుగురు ఎన్నికయ్యారు.

Update: 2024-11-07 09:44 GMT

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అత్యంత రసవత్తరంగా జరిగిన అధ్యక్ష ఎన్న్నికల్లో ఈసారి భారతీయ అమెరికన్ ఓటర్ల పాత్ర కీలకంగా మారిందని చెబుతున్నారు. వీరిలో యువ ఓటర్లు ట్రంప్ కి అనుకూలంగా ఓటు వేశారనే కామెంట్లూ వినిపిస్తున్నాయి.

 

మరోపక్క భారతీయ మూలాలున్న డెమోక్రాట్ల అభ్యర్థి కమలా హారీస్ వైపు కూడా మెజారిటీ భారతీయ అమెరికన్ ఓటర్లు నిలిచారని అంటున్నారు. ఆ సంగతి అలా ఉంటే... ఈ ఎన్నికల్లో భారతీయ అమెరికన్లు సత్తా చాటారు. ఇందులో భాగంగా... ప్రతినిధుల సభకు ఈసారి ఆరుగురు ఎన్నికయ్యారు.

అవును... అమెరికా అధ్యక్ష అభ్యర్థి ఎన్నికల్లో ఆరుగురు భారతీయ అమెరికన్లు గెలుపొందారు. వీరిలో ఐదుగురు సభ్యులు గత ఎన్నికల్లోనూ గెలిచినవారే కావడం గమనార్హం. గత కాంగ్రెస్ లో అయిదుగురు భారతీయ అమెరికన్ లు సభ్యులుగా ఉండగా.. ఈ సారి ఆ సంఖ్య ఆరుకి పెరిగింది! ఈ జాబితాలో తాజగా సుహాస్ సుబ్రహ్మణ్యం కలిశారు!

రాజా కృష్ణమూర్తి, రో ఖన్నా, శ్రీ తానేదార్, డాక్టర్ అమిబెరా, ప్రమీలా జయపాల్ లు గత ఎన్నికలతో పాటు ఈసారీ విజయం సాధించగా.. ఈసారి వారితో పాటు భారతీయ అమెరికన్ న్యాయవాది సుహాస్ సుబ్రహ్మణ్యం వర్జీనియా 10వ కాంగ్రేషనల్ డిస్ట్రిక్ట్ నుంచి విజయం సాధించారు.

ఈ సందర్భంగా.. వర్జీనియా నుంచే కాకుండా అమెరికాలోని తూర్పు తీర ప్రాంతం నుంచి ప్రతినిధుల సభ్యులు ఎన్నికైన తొలి భారతీయ అమెరికన్ గా చరిత్ర సృష్టించారు. ఈయన గతంలో బరక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వైట్ హౌస్ సలహాదారుగా సేవలందించారు.

ఇక మరోసారి గెలిచిన మిలిగిన ఐదుగురిలో... డాక్టర్ అమిబెరా.. కాలిఫోర్నియాలోని 6వ కాంగ్రేషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ఏడోసారి విజయం సాధించగా... ఇల్లినోయీ 8వ కాంగ్రేషనల్ డిస్ట్రిక్ట్ నుంచి రాజా కృష్ణమూర్తి వరుసగా ఐదోసారి గెలుపొందారు. వాషింగ్టన్ లోని 7వ కాంగ్రేషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ప్రమీల గెలుపొందారు.

ఇదే సమయంలో... కాలిఫోర్నియాలోని 7వ కాంగ్రేషనల్ డిస్ట్రిక్ట్ నుంచి రో ఖన్నా విజయకేతనం ఎగురవేశారు. అటు ప్రమీల, ఇటు రో ఖన్నాలు 2017 నుంచి తమ విజయ పరంపరను కొనసాగిస్తున్నారు. ఇక తానేదర్ మిషిగన్ లోని 13వ కాంగ్రేషనల్ డిస్ట్రిక్ట్ నుంచి వరుసగా రెండోసారి గెలుపొందారు.

Tags:    

Similar News