హైదరాబాద్ లో రూ.100 కోట్ల బంగారం సీజ్..ఆ వ్యాపారి ఎవరంటే

Update: 2022-10-19 04:21 GMT
హైదరాబాద్ వాసులకు ముసద్దిలాల్ జెమ్స్ అండ్ జువెల్లర్స్ ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గడిచిన కొంతకాలంగా వివిధ బ్రాండ్లతో బంగారు షాపులు ఓపెన్ చేయటానికి ముందు హైదరాబాద్ లోని ప్రముఖ బంగారు షాపుల్లో ముందుంటుంది ముసద్దిలాల్ జ్యుయెలర్స్. పెద్దనోట్ల రద్దు వేళలోనూ ఈ సంస్థ మీద పెద్ద ఎత్తున ఆరోపణలు రావటం.. కేసులు నమోదు కావటం తెలిసిందే.

తాజాగా ఈ సంస్థపై ఈడీ తనిఖీల కొరడా ఝుళిపించింది. రెండు రోజులు వరుసగా తనిఖీలు చేపట్టిన ఈడీ.. లెక్కల్లో చూపించని రూ.100 కోట్ల బంగారు.. వజ్రాభరణాల్ని సీజ్ చేయటం సంచలనంగా మారింది.

ఒక్క బంగారు షాపులోనే లెక్కల్లోకి రాని నగల విలువ రూ.100కోట్లు ఉంటే.. మొత్తం హైదరాబాద్ లో ఉన్న బంగారు షాపుల్లోనే ఇదే తరహా లెక్కలు చూస్తే.. పరిస్థితి ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది.

హైదరాబాద్ తో పాటు ఏపీలోని విజయవాడ.. గుంటూరులోనూ ముసద్దిలాల్ షోరూమ్ లు ఉండటం తెలిసిందే. భారీ ఎత్తున లెక్క చూపని బంగారం.. వజ్రాభరణాల్ని స్వాధీనం చేసుకున్న ఈడీ అధికారులు వాటిని సీజ్ చేశారు.

అబిడ్స్ లోని ఎస్ బీఐకి తరలించి.. అక్కడ భద్ర పరిచారు. సంస్థ ఎండీ సుఖేశ్ గుప్తాను అరెస్టు చేశారు. బినామీ పేర్లతో సంస్థకు చెందిన డైరెక్టర్లు సుఖేశ్ గుప్తా.. అనురాగ్ గుప్తాలు రూ.50 కోట్ల మేర ఆస్తులు కూడబెట్టినట్లుగా అంచనా వేస్తున్నారు.

గతంలో ముసద్దిలాల్ సంస్థ రూ.504 కోట్ల బంగారాన్ని కొనుగోలు చేయటం.. అందులో భారీగా అక్రమాలు జరిగినట్లుగా 2014లో సీబీఐ కేసు నమోదు చేసింది. దీని ఆధారంగా మనీలాండరింగ్ పై దర్యాప్తు చేసిన ఈడీ.. గత ఏడాది రూ.300 కోట్ల ఆస్తుల్ని అటాచ్ చేస్తే.. తాజాగా రూ.100 కోట్ల అక్రమ బంగారాన్ని సీజ్ చేయటం సంచలనంగా మారింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News