భ‌ర్త‌కు త‌లాఖ్ చెప్పిన ఇండియ‌న్ మ‌లాలా

Update: 2017-06-17 09:34 GMT
బాలిక‌ల హ‌క్కులు - విద్య‌ కోసం కరుడుగ‌ట్టిన తాలిబ‌న్ ఉగ్ర‌వాదుల‌తో పోరాడిన మ‌లాలాను ఆద‌ర్శంగా తీసుకుందో బాలిక‌. త‌న భ‌ర్త - అత్త‌మామ‌ల‌ను ఎదిరించి  చ‌దువును కొన‌సాగించాల‌ని నిర్ణ‌యించుకుంది. అందుకోసం త‌న‌ భ‌ర్త‌కు ట్రిపుల్ త‌లాఖ్ ఇచ్చేసి అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో ముంచెత్తింది.

కోల్‌ కతాలోని ముల్లిక్‌పూర్ మండిబజార్‌ కు చెందిన సర్జుల్ ఘరమి ముగ్గురు కుమార్తెల్లో మంపి ఖాతూన్ ఒకరు. ఆమె తొమ్మిదో తరగతి చదువుతుండగానే పెద్ద‌లు వివాహం జ‌రిపించారు. అయితే, పెళ్లి త‌ర్వాత కూడా  చదువు కొనసాగిస్తానన్న ఒప్పందంతోనే నిఖా జరిగింది. ఈ ఏడాది జరిగిన మాధ్యమిక పరీక్షల్లో మంపి ఉత్తీర్ణురాలైంది. తాను 11వ తరగతిలో చేరుతానని భర్తకు చెప్పినా అత‌డు పెడ చెవిన పెట్టాడు.

ప‌ట్టువ‌ద‌ల‌ని మంపి భ‌ర్త‌ను బ్ర‌తిమిలాడినా అత‌డు చ‌దువుకోవ‌డానికి అంగీక‌రించ‌లేదు. కొద్ది రోజుల క్రితం పుట్టింటికి వెళ్లిన మంపి చదువు కొనసాగిస్తానని, భర్త ఇంటికి వెళ్లేది లేదని త‌ల్లిదండ్రుల‌కు చెప్పింది.గత నెలలో కృష్ణ‌చందాపూర్‌ లోని హైస్కూల్‌ లో చేరింది. చ‌దువుపై మంపికి ఉన్న‌ ఆస‌క్తిని గ‌మ‌నించిన‌ హెడ్మాస్టర్ చందన్ కుమార్ ఆమె ట్యూష‌న్ ఫీజును ర‌ద్దు చేశారు.

మంపి స్కూల్లో చేరిన విషయం తెలుసుకున్న భర్త - అత్తమామలు బాలిక ఇంటికి వచ్చి నానా ర‌చ్చ చేశారు. స్కూల్ మానేసి తమతో పాటు ఇంటికి పంపించాల్సిందిగా  మంపి త‌ల్లిదండ్రుల‌ను కోరారు. ఈ విష‌యాన్ని గ్రహించిన మంపి త‌న‌ భర్తకు మూడుసార్లు తలాక్ చెప్పింది. దీంతో మంపి భ‌ర్త - అత్త‌మామ‌లు తోక ముడుచుకుని వెళ్లారు.త‌న త‌ల్లిదండ్రులు అండగా నిలబడడం చాలా ఆనంద‌న్ని క‌లిగించింద‌ని మంపి తెలిపింది.

దేశవ్యాప్తంగా ట్రిపుల్ తలాక్‌ పై విస్తృత చర్చ జరుగుతున్న వేళ మంపి నిర్ణ‌యం ప‌లువురిని ఆశ్చర్యపరిచింది. ఆమెపై ప‌లువురు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు. తన జీవితాన్ని తానే తీర్చిదిద్దుకోవాలనుకున్నానని, మలాలా దారిలో పయనిస్తానని మంపి ఖాతూన్ పేర్కొంది. ఆమెకు సాయం చేసేందుకు పలువురు ముందుకొస్తున్నారు. 

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News