గ‌వ‌ర్న‌ర్ రేసులో ఆ హైస్కూల్ కుర్రాళ్లు!

Update: 2017-08-12 12:46 GMT
మీరు చ‌దివింది అక్ష‌రాల నిజ‌మే. రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ పోస్ట్ కోసం ఇద్ద‌రు హైస్కూల్ కుర్రాళ్లు పోటీ ప‌డ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మార‌టమే కాదు అమెరిక‌న్ల దృష్టిని విప‌రీతంగా ఆక‌ర్షిస్తోంది. పోటీలో ఉన్న ఇద్ద‌రు కుర్రాళ్ల వ‌య‌సు 16 ఏళ్లు కావ‌టం గ‌మ‌నార్హం. ఇంత‌కూ గ‌వ‌ర్న‌ర్ పోస్ట్ కోసం ఎలా పోటీ ప‌డుతున్నారంటే ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని చెబుతున్నారు.  కాన్సాస్ రాష్ట్రంలో గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి కోసం జ‌రుగుతున్న ఎన్నిక‌ల సంగ్రామం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. హైస్కూల్ కూడా పూర్తి కాని విద్యార్థులు గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి కోసం పోటీ ప‌డ‌ట‌మే దీనికి కార‌ణం.

గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి కోసం పోటీ ప‌డాలంటే వ‌య‌సు అర్హ‌త ఉంటుంద‌న్న సందేహం రాక మాన‌దు. నిజ‌మే.. అయితే.. ఇక్క‌డే ఒక ఆస‌క్తిక‌ర విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. అమెరికాలోని ప‌లు రాష్ట్రాల్లో గ‌వ‌ర్న‌ర్ పోస్ట్ కోసం పోటీ ప‌డాలంటే క‌నీస వ‌య‌సు 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వ‌ర‌కూ ఉంది. కొన్ని రాష్ట్రాల్లో అయితే 30 ఏళ్లుగా ఉంది. ఓక్లామా రాష్ట్రంలో అయితే 31 ఏళ్లు ఉండాలి. అయితే.. కాన్సాస్.. వ‌ర్మోంట్ రాష్ట్రాల్లో మాత్రం గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వికి పోటీ చేసే అభ్య‌ర్థుల వ‌య‌సు ఎంత ఉండాల‌నే విష‌యాన్ని స్ప‌ష్టంగా పేర్కొన‌లేదు.

ఓట‌ర్ల వ‌య‌సు మాత్ర‌మే ఇక్క‌డ స్ప‌ష్టంగా ప్ర‌స్తావించారు. ఈ నేప‌థ్యంలో 2018లో జ‌రిగే కాన్సాస్ ఎన్నిక‌ల్లో డెమొక్ర‌టిక్ పార్టీ త‌ర‌ఫున జాక్ బ‌ర్గ్ స‌న్ అనే హైస్కూల్ విద్యార్థి పోటీ ప‌డుతుండ‌గా.. మ‌రో హైస్కూల్ విద్యార్థి అలెగ్జాండ‌ర్ క్లైన్ కూడా పోటీకి దిగాడు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఈ ఇద్ద‌రు కుర్రాళ్ల‌కు ఓటుహ‌క్కు కూడా లేక‌పోవ‌టం.

ఒక టీవీ చాన‌ల్ లో ప్ర‌సార‌మైన జిమ్మీ కిమ్మెల్ లైవ్ అనే కామెడీ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న జాక్ బ‌ర్గ‌స‌న్ తాను గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి కోసం పోటీలోకి దిగ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.

ఈ ఇద్ద‌రు విద్యార్థుల‌కు వ‌చ్చే ఏడాది స్కూల్ ఎడ్యుకేష‌న్ పూర్తి కానుంది. గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి కోసం ఈ పిల్ల‌లు పోటీకి దిగుతానంటే ప‌ట్టించుకుంటారా? అన్న సందేహం అక్క‌ర్లేదంటున్నారు. ఎందుకంటే.. ఇప్ప‌టికే త‌న ఎన్నిక‌ల ఫండ్ కి 1300 డాల‌ర్ల ఫండ్ వ‌చ్చిన‌ట్లుగా జాక్ వెల్ల‌డించాడు. యువ‌కులైన త‌మ మాట‌ల్ని ఎవ‌రూ సీరియ‌స్ గా తీసుకోర‌నుకున్నామ‌ని.. కానీ.. కాన్సాస్ ప్ర‌జ‌లు త‌మ మూస ధోర‌ణిని విడిచి పెట్టిన‌ట్లుగా త‌మ‌కు అర్థ‌మైంద‌ని చెబుతున్నారు. మ‌రి.. ఎన్నిక‌ల ప్ర‌క్రియ ముందుకు వెళ్లే కొద్దీ ఈ పిల్ల‌ల వ్య‌వ‌హారం ఎక్క‌డి వ‌ర‌కూ వెళుతుంద‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. అయినా.. ఓటుహ‌క్కు లేని వారు.. ఎన్నిక‌ల్లో పోటీ ప‌డే ఛాన్స్ ఎక్క‌డిద‌న్న లాజిక్ ను ఇప్ప‌టివ‌ర‌కూ వారిని ప్ర‌శ్నించ‌లేదా? అన్న సందేహాన్ని కొంద‌రు వ్య‌క్తం చేస్తున్నారు.
Tags:    

Similar News