2 రోజుల లాక్ డౌన్ : కేంద్రాన్ని నిలదీసిన సుప్రీం

Update: 2021-11-13 09:40 GMT
ప్రజలు ఎలా బతకాలి, రెండ్రోజుల లాక్‌ డౌన్ విధించడం కానీ, ఇంకేదైనా ఆలోచన కానీ చేస్తున్నారా, తక్షణం చర్యలు తీసుకోండి, ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రతపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ కేంద్రాన్ని నిలదీస్తూ శనివారం రోజు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఇళ్లల్లో కూడా మాస్క్‌లు ధరించాల్సి వస్తోందంటే వాయు కాలుష్య పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధమవుతోందని అన్నారు.

ఇది మామూలు సమస్య కాదన్నారు. వాయు కాలుష్య నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ప్రభుత్వాన్ని కోరారు సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ. పంటల దగ్ధాన్ని తగ్గించేందుకు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని సొలిసిటర్‌ జనరల్‌ ను ప్రశ్నించారు.

రెండు, మూడు రోజుల్లో కాలుష్య నియంత్రణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అవసరమైతే రెండ్రోజులు లాక్‌డౌన్‌ అంశాన్ని పరిశీలించాలని సూచించారు. వాయు కాలుష్యాన్ని తీవ్రంగా పరిగణించాలని , ఇళ్లలో కూడా మాస్కులు ధరించాల్సి వస్తోందని పేర్కొన్నారు సీజేఐ.

5వందలుగా ఉన్న ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ ను కనీసం 2వందలకు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వెంటనే పంజాబ్‌, హర్యానా ప్రభుత్వాలు అత్యవసర సమావేశాలు ఏర్పాటుచేసి, పంటల దగ్ధాన్ని తగ్గించేలా చర్యలు చేపట్టాలన్నారు. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు.

చిన్న పిల్లలు కూడా వాయుకాలుష్యంలోనే స్కూళ్లకు వెళ్లాల్సి వస్తోంది. ఇలాంటి వాతావరణానికి వారిని విడిచిపెడుతున్నాం. డాక్టర్ గులేరియా సైతం పిల్లల్ని కాలుష్యం బారిన, డెంగ్యూ వంటి మహమ్మారిల బారిన పడేస్తున్నామని చెబుతున్నారు.

వాయి నాణ్యతను సాధారణ పరిస్థితికి తీసుకువచ్చేందుకు మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు. రెండు రోజుల లాక్‌ డౌన్ విధించే ఆలోచన కానీ, మరేదైనా కానీ మీకు ఉందా జనం ఎలా జీవించాలి అని కోర్టు నిలదీసింది. పంట వ్యర్థాలను తగులబెట్టేందుకు 2 లక్షల మిషన్లు అందుబాటులో ఉండగా, మార్కెట్‌లో రెండు మూడు రకాల మిషన్లు ఉన్నాయని, కానీ రైతులు అంత ఖర్చుతో కొనుగోలు చేయగలిగిన పరిస్థితుల్లో లేరని కోర్టు తెలిపింది. ఈ మిషన్లను కేంద్రం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ రైతులకు ఎందుకు అందివ్వడం లేదని సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది.



Tags:    

Similar News