2019లో మోదీకి అంత వీజీ ఏమీ కాద‌ట‌!

Update: 2017-06-25 04:22 GMT
2014 సార్వ‌త్రిక ఎన్నిక‌లు దేశ గ‌మ‌నాన్నే మార్చాయ‌ని చెప్పాలి. ఎందుకంటే... అప్ప‌టిదాకా ఎప్పుడో పాత చింత‌కాయ ప‌చ్చ‌డి మాదిరి ఎన్నిక‌ల ప్ర‌చారం - మిత్ర‌ప‌క్షాల‌తో క‌లిసి గానీ ప్ర‌భుత్వాల‌ను ఏర్పాటు చేయ‌లేని ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీలు... ఇవే అప్ప‌టిదాకా మ‌న‌కు క‌నిపించిన చిత్రాలు. అయితే 2014 ఎన్నిక‌ల్లో సంపూర్ణ మెజారిటీతో కేంద్రంలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘ‌న‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి ద‌క్కింది. అది కూడా గ‌డ‌చిన 30 ఏళ్ల చ‌రిత్ర‌లో ఏ ఒక్కరికి సాధ్యం కాని ఈ ఫీట్‌... ఒక్క మోదీకి మాత్ర‌మే సాధ్య‌మైంద‌ని చెప్పాలి. ఎన్నిక‌ల ప్ర‌చారంలో అప్ప‌టిదాకా క‌నిపించిన రొటీన్ మాట‌లకు మోదీ చెక్ పెట్టేశారు. అందుబాటులోకి వ‌చ్చిన సోష‌ల్ మీడియాను స‌మ‌ర్ధ‌వంతంగా వాడుకున్న మోదీ... చాయ్ పే చ‌ర్చా అంటూ కొత్త నినాదాల‌ను వినిపించారు.

వెర‌సి అప్ప‌టిదాక ప‌దేళ్ల పాటు పాల‌న సాగిస్తున్న యూపీఏను చావుదెబ్బ కొట్ట‌డ‌మే కాకుండా... గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్‌ కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా కూడా అంద‌ని స్థితిలోకి ప‌డేశారు. ఇదంతా జ‌రిగి ఇప్ప‌టికే మూడేళ్లు గ‌డిచిపోయింది. మ‌రో రెండేళ్ల‌లో ఎన్నిక‌లు రానున్నాయి. ఆ ఎన్నిక‌ల్లో మోదీ త‌ప్ప‌నిస‌రిగా రెండో ప‌ర్యాయం విజ‌యం సాధిస్తార‌ని ఇప్ప‌టిదాకా అన్ని ర‌కాల విశ్లేష‌కులు బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెప్పారు. అయితే 2019లో మోదీకి విజ‌యం అంత ఈజీ ఏమీ కాద‌న్న వాద‌న కొత్త‌గా తెర‌పైకి వ‌స్తోంది. ఇదేదో విప‌క్ష పార్టీలో, మోదీ అండ్ కో అంటే ఇష్టంలేని విశ్లేష‌కులలో చేస్తున్న వాద‌న కాదు. వాస్త‌వ ప‌రిస్థితిని, తాజా అంశాల‌ను బేరీజు వేసి మ‌రీ ఓ అంత‌ర్జాతీయ దిన‌ప‌త్రిక చెబుతున్న విష‌యం.

అంత‌ర్జాతీయ మీడియాగా గుర్తింపు పొందిన *డెయిలీ మెయిల్* ఈ దిశ‌గా ఓ ఆస‌క్తిక‌ర వార్తా క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. 2019 ఎన్నిక‌ల్లో మోదీ అప‌జ‌యం పాల‌వుతార‌ని ఆ ప‌త్రిక చెప్ప‌లేదు గానీ... ప్ర‌స్తుతం దేశంలో ఉన్న రెండు ప్ర‌ధాన స‌మ‌స్య‌లు ఎన్నిక‌ల దాకా కొన‌సాగితే మాత్రం మోదీకి ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని ఆ ప‌త్రిక హెచ్చరిక‌లు జారీ చేస్తున్న రీతిలో ప్ర‌త్యేక క‌థ‌నాన్ని రాసింది. ఈ క‌థ‌నం ప్ర‌కారం... ప్ర‌స్తుతం మ‌ధ్య‌ప్ర‌దేశ్ స‌హా ప‌లు రాష్ట్రాల్లో అన్న‌దాత‌ల ఆత్మ‌హ‌త్య‌లు, సాగు రంగాన్ని బ‌తికించేందుకు ప‌క్కా ప్ర‌ణాళిక‌లు ర‌చించాల‌ని కోరుతూ రైతులు చేస్తున్న ఆందోళ‌న‌లు నానాటికి ఉధృత‌మ‌వుతున్నాయి. ఎక్క‌డిక‌క్క‌డ రైతుల ఆందోళ‌న‌ల‌కు విప‌క్షాలు పూర్తి మ‌ద్ద‌తుగా నిలుస్తున్నాయి.

సాగు రంగాన్ని ప‌ట్టి పీడిస్తున్న రుణాలు అన్న‌దాత‌ల‌ను బ‌ల‌వ‌న్మ‌ర‌ణాల వైపుగా లాక్కెళుతోంది. ఈ త‌ర‌హా ప‌రిస్థితి... మోదీ స‌ర్కారుపై జ‌నంలో వ్య‌తిరేక‌త‌కు కార‌ణం కాక మాన‌దు. అదే స‌మ‌యంలో నానాటికీ త‌గ్గిపోతున్న ఉద్యోగావ‌కాశాలు, ఆటోమేష‌న్ నేప‌థ్యంలో ర‌ద్దైపోతున్న కొలువులు కూడా దేశంలో ప్ర‌ధాన స‌మ‌స్య‌గా మారిపోతోంది. ఉద్యోగాలు రాక నిరుద్యోగులు తీవ్ర నిరాశా నిస్పృహ‌ల్లో కూరుకుపోతుంటే... ఉన్న ఉద్యోగాలు కోల్పోతున్న ఉద్యోగులు... ఇదంతా మోదీ స‌ర్కారు పుణ్య‌మేన‌న్న భావ‌న‌లోకి వెళుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ రెండు స‌మ‌స్య‌ల‌ను మోదీ ఎంత త్వ‌ర‌గా ప‌రిష్క‌రిస్తే... అంత మంచిద‌ని, లేని ప‌క్షంలో 2019 ఎన్నిక‌ల్లో ఈ రెండు స‌మ‌స్య‌లే మోదీకి గుదిబండ‌గా మారే ప్ర‌మాద‌ముంద‌ని ఆ క‌థ‌నం పేర్కొంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News