కరోనా ఎఫెక్ట్... ఆర్థిక మాంద్యం తప్పదంతే

Update: 2020-03-23 04:05 GMT
ప్రాణాంతక వైరస్ గా మారిన కోవిడ్- 19 ప్రపంచ దేశాలను వణికించేస్తోంది. చైనాలోని వూహాన్ లో పుట్టిన ఈ వైరస్ కేవలం నెల కూడా తిరక్కుండానే ఏకంగా ప్రపంచలోని దాదాపుగా అన్ని దేశాలను చుట్టేసింది. ఫలితంగా అన్ని దేశాలు కూడా ఈ వైరస్ ను కట్టడి చేయడమే ప్రథమ కర్తవ్యంగా కొత్త తరహా చర్యలను చేపట్టక తప్పలేదు. ఇప్పటికే 3 లక్షల మందికి పైగా ఈ వైరస్ సోకగా.. 11 వేల మందికి పైగా మరణాలు సంభవించాయి. అతి తక్కువ కాలంలో ఇంతమేర ప్రభావాన్ని చూపిన కరోనా పేరు వింటేనే అన్ని దేశాలు జడుసుకుంటున్నాయి. వెరసి లాక్ డౌన్ లు, షట్ డౌన్ లు ప్రకటించేస్తున్నాయి. ఈ పరిస్థితి ఇంతకు మించి వేరే విధంగా ఉండే అవకాశం కూడా లేని పరిస్థితి. మరి ఈ పరిస్థితి మరింత కాలం ఇలాగే కొనసాగితే... అప్పుడెప్పుడో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేసిన ఆర్థిక మాంద్యం మరోమారు ఎంట్రీ ఇవ్వక తప్పదన్న భయాందోళనలు అప్పుడే మొదలైపోయాయి.

కోవిడ్- 19 వైరస్ ప్రపంచ దేశాలను ఆర్థిక మాంద్యంలోకి నెట్టేస్తుందా? అంటే... కళ్లెదుటే కనిపిస్తున్న పరిస్థితిని చూస్తే.. ఇందులో ఇంకా సందేహాలున్నాయా? అన్న మాట కూడా గట్టిగానే వినిపిస్తోంది. అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయాయి. స్థానిక రవాణా మొత్తం బంద్ అయిపోయింది. ఆయా పరిశ్రమలు తమ ఉత్పత్తిని భారీగా తగ్గించేశాయి. విద్యా సంస్థలు మూతపడ్డాయి. సినిమా థియేటర్లు మూతపడ్డాయి. ప్రజా రవాణా కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయింది. షాపింగ్ మాల్స్ మూతపడ్డాయి. అంటే... దాదాపుగా జన జీవనం స్తంభించినట్టే కదా. ఇదే పరిస్థితి భారత్ లోని మన తెలుగు రాష్ట్రాలతో పాటుగా చాలా రాష్ట్రాల్లో ఈ నెలాఖరు దాకా కొనసాగనుంది. అంటే... ఏకంగా పదిరోజుల పాటు ఈ రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించినట్టే కదా. మరి ఈ సమయంలో ఆర్థిక మాంద్యం తరహా పరిస్థితులే కనిపిస్తాయి కదా.

మన రాష్ట్రాల్లోనే ఇలాంటి పరిస్థితి ఉంటే... ఇక జనం పిట్లల్లా రాలిపోతున్న ఇటలీ లాంటి దేశాల పరిస్థితి ఏమిటనే విషయం కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడినే భయపెట్టిన కరోనా పేరు వింటేనే అమెరికా పౌరులు కూడా వణికిపోతున్న పరిస్థితి. మొత్తంగా ప్రపంచంలోని దేశాలన్ని కూడా తమకు తాముగా పరిమితులు విధించుకుంటున్నాయి. ఈ పరిమితుల దృష్ట్యా ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగానే ప్రభావితం కానున్నాయి. అంతేకాకుండా లాక్ డౌన్, షట్ డౌన్ల ప్రభావంతో ఆయా దేశాల జీడీపీ కూడా భారీగా పడిపోయే ప్రమాదం లేకపోలేదు. మరి ఇంతలా ఏకంగా ప్రపంచ దేశాల జీడీపీలపైనే దెబ్బ పడిపోతే... ఆర్థిక మాంద్యం ఎంట్రీ ఇచ్చినట్టే కదా. అంటే త్వరలో మన కళ్ల ముందు ప్రత్యక్షం కానున్న ఆర్థిక మాంద్యానికి వేరే ఏ ఒక్క అంశం కారణం కాదు.. ఒక్క కరోనానే కారణమని చెప్పక తప్పదు. మరి కరోనా కారణంగా ఎంట్రీ ఇవ్వనున్న ఆర్థిక మాంద్యం ప్రభావం ఏ మేర ఉంటుందన్న విషయంపై ఇప్పుడిప్పుడే ఆర్థిక రంగ ప్రముఖులు అంచనాల్లో మునిగిపోయారు. అంతేకాకుండా కరోనా కారణంగా ఏర్పడే ఆర్థిక మాంద్యం నుంచి ఎఫ్పుడు బయటపడతామోనన్న ఆందోళన ఆయా దేశాలను పట్టి పీడిస్తోందనే చెప్పాలి.
Tags:    

Similar News