2022.. భారత్ క్రికెట్ కు అత్యంత చేదు సంవత్సరం

Update: 2022-12-31 12:30 GMT
ఏడాది ప్రారంభంలోనే జట్టు కెప్టెన్సీ వివాదం.. బోర్డు వర్సెస్ కెప్టెన్.. జట్టు కూర్పులో లోపాలు.. కీలక ఆటగాళ్ల గాయాలు.. ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో ఓటములు.. ఏడాది చివరకు మళ్లీ కెప్టెన్సీ వివాదం.. బీసీసీఐ పాలకుడి మార్పు.. ఎన్నడూ లేని విధంగా సెలక్టర్లపై వేటు.. ఇదీ భారత క్రికెట్ 2022లో ఎదుర్కొన్న అనుభవం. దీనికితోడు వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదం. బహుశా ఇటీవలి సంవత్సరాల్లో ఎన్నడూ ఎదుర్కోనన్ని సవాళ్లను భారత క్రికెట్ 2022లో ఎదుర్కొంది. అయితే, మధ్యలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెరిపించింది. ఈ ఏడాది రెండు సార్లు జరిగిన వేలంలో ఆటగాళ్లు రికార్డు ధరకు అమ్ముడుపోయారు.

రోహిత్ కెప్టెన్సీ మురిపెం ఏడాదేనా?

2021 చివరలో కోహ్లి.. భారత క్రికెట్ బోర్డు మధ్య కెప్టెన్సీ వివాదం సాగింది. టి20 సారథ్యం వదిలేస్తానని కోహ్లి అనడం.. వన్డే పగ్గాలు కూడా వదులుకోమని బోర్డు చెప్పడం.. ఇది కమ్యూనికేషన్ గ్యాప్ లా కనిపించడం.. చివరకు కోహ్లి పరిమిత ఓవర్ల ఫార్మాట్ సారథ్యం నుంచి వైదొలగడం జరిగిపోయాయి. ఆ వెంటనే దక్షిణాఫ్రికా సిరీస్ తోనే టెస్టు పగ్గాలనూ వదిలేశాడు. దీంతో స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అన్ని ఫార్మాట్లకు సారథి అయ్యాడు. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ను చక్కగా నడిపించిన రోహిత్ టీమిండియాను మేటిగా తీర్చిదిద్దుతాడని భావించారు. కానీ, వరుసగా ద్వైపాక్షిక సిరీస్‌లను గెలిపించినప్పికీ, కోహ్లి బాటలోనే మెగా ఈవెంట్లలో విజేతగా నిలపలేకపోయాడు.అయితే, ఒకే ఏడాదిలో టీ20ల్లో అత్యధిక విజయాలను అందించిన కెప్టెన్‌గా రోహిత్ అవతరించాడు. బ్యాటర్‌గా మాత్రం రోహిత్ పరిస్థితి గొప్పగా ఏమీ లేదు. అలాగే వైస్‌ కెప్టెన్‌ కేఎల్ రాహుల్‌ ఫామ్‌ అందుకోలేకపోయాడు.

కోహ్లి ఫామ్ లోకి వచ్చాడు కానీ..

మూడేళ్లుగా సెంచరీ లేక అల్లాడిన కోహ్లి ఆ కరువును తీర్చుకున్నాడు. సెప్టెంబరులో ఆసియా కప్ లో అఫ్గానిస్థాన్ పై, డిసెంబరులో బంగ్లాదేశ్ పై వన్డేల్లో మూడంకెల స్కోరు కొట్టాడు. టి20ల్లో తొలిసారి సెంచరీ చేశాడు. అయితే, ఆసియా కప్ నకు ముందు నెలరోజుల పాటు విశ్రాంతి తీసుకొని వచ్చాడు. టెస్టు స్పెషలిస్టు పుజారా తాజాగా టెస్టుల్లో శతకం చేసి సుదీర్ఘ నిరీక్షణకు తెర దించాడు. గమనార్హమేమంటే.. కోహ్లి టి20ల్లో శతకం అందుకున్న సంవత్సరమే టి20 జట్టులో అతడి స్థానం ప్రశ్నార్థకం అయింది. పొట్టి ఫార్మాట్ లో జట్టు జోరు పెరగాల్సిన రీత్యా కోహ్లి, రోహిత్, కేఎల్ రాహుల్ లనూ పక్కన పెట్టాలనే వాదన మొదలైంది.

క్యాష్ రిచ్ ఐపీఎల్

ఈ ఏడాది ఫిబ్రవరి, డిసెంబరు రెండుసార్లు ఐపీఎల్ వేలం జరిగింది. ఫిబ్రవరిలో జరిగిన మెగా వేలంలో టీమిండియా యువ ఆటగాడు ఇషాన్‌ కిషన్ (రూ. 15.25 కోట్లు) భారీ ధరను సొంతం చేసుకొని రికార్డు సృష్టించాడు. డిసెంబరులో జరిగిన మినీ వేలంలో ఆల్‌రౌండర్లకు మంచి గిరాకీ తగలింది. ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు శామ్ కరన్ (రూ. 18.50 కోట్లు), బెన్‌ స్టోక్స్ (రూ. 16.25 కోట్లు), ఆసీస్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ (రూ. 17.50 కోట్లు)లు జాక్‌పాట్‌ కొట్టారు. ఇక ఈ ఏడాది రెండు కొత్త జట్లు లీగ్ లోకి అడుగు పెట్టాయి. కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్యా తొలి ప్రయత్నంలోనే గుజరాత్‌ టైటాన్స్ కు కప్‌ అందించాడు. పది జట్లతో హోరాహోరీగా సాగిన మ్యాచుల్లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై, ఐదు సార్లు ఛాంపియన్‌ ముంబయి జట్లను కాదని గుజరాత్ టైటాన్స్ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. కొత్తగా వచ్చిన కేఎల్ రాహుల్‌ నాయకత్వంలోని మరో జట్టు లక్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ ప్లేఆఫ్స్‌ వరకు వచ్చింది.

గంగూలీ వైదొలగక తప్పలేదు..

బీసీసీఐ అంటే అత్యంత శక్తిమంతమైన బోర్డు. అలాంటి బోర్డుకు సౌరభ్ గంగూలీ చైర్మన్ అంటే మరింత శక్తిమంతం. కానీ, అతడికి రెండోసారి పదవి దక్కలేదు. ఎన్నో సమీకరణాల మధ్య 2019లో గంగూలీ బోర్డు చైర్మన్ అయ్యాడు. మూడేళ్లు తిరిగేసరికి ఒంటరై పోయిన పరిస్థితి. సెప్టెంబర్‌తో గంగూలీ పదవీ కాలం ముగిసింది. ఆ వెంటనే ఐసీసీ ఛైర్మన్‌ పగ్గాలు చేపట్టాలని భావించాడు. కానీ, బీసీసీఐ సహా ఎక్కువ బోర్డుల నుంచి మద్దతు లేకపోవడంతో వైదొలగాడు. మరోసారి బీసీసీఐ అధ్యక్ష పదవి చేపట్టే అవకాశం ఉన్నా ఉన్నతస్థాయిలో చోటు చేసుకున్న పరిణామాలు గంగూలీకి ఆ పదవి దూరమైంది. బీసీసీఐ కార్యదర్శిగా మరోసారి ఎన్నికైన జై షా ఆసియా క్రికెట్ కౌన్సిల్, ఐసీసీ ఆర్థిక కమిటీలో భారత్‌ ప్రతినిధిగా ఉన్నారు. మాజీ ఆటగాడు రోజర్ బిన్నీ బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై పదవీ బాధ్యతలు చేపట్టాడు. ప్రపంచకప్‌ విన్నింగ్‌ జట్టులో సభ్యుడైన రోజర్‌కు కర్ణాటక క్రికెట్‌ సంఘానికి అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది. కెప్టెన్సీ విషయంలో కోహ్లి పట్ల వ్యవహరించిన తీరుకే గంగూలీకి ఇలాంటి పరిస్థితి ఎదురైందని అభిమానులు నెట్టింట్లో నిప్పులు చెరిగారు.

టోర్నీలు, కప్ లు పాయె..

సెప్టెంబరులో ఆసియా కప్, నవంబరులో టి20 ప్రపంచ కప్.. అంతకుముందు ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్. మూడింట్లోనూ భారత్ కు చేదు అనుభవమే. ప్రపంచ కప్ లో సెమీస్‌కు చేరితే.. ఇంగ్లాండ్‌ చేతిలో పది వికెట్ల తేడాతో పరాభవం ఎదురైంది. ఆసియా కప్‌లో సూపర్-4 దశలోనే ఇంటిముఖం పట్టింది. రానున్న రోజుల్లో వ్యక్తిగతంగా ఉత్తమ ప్రదర్శన చేయకపోతే మాత్రం రోహిత్‌ తన కెప్టెన్సీతోపాటు జట్టులో స్థానం కూడా గల్లంతు కావడం తథ్యమని విశ్లేషకుల అభిప్రాయం.

సెలక్షన్ కమిటీ పాయె

భారత సెలక్షన్ కమిటీ అంటే థ్యాంక్ లెస్ జాబ్. ఈ విషయాన్ని మరోసారి నిరూపిస్తూ చేతన్‌ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీపై బీసీసీఐ వేటు వేసింది. టీ20 ప్రపంచకప్‌ కోసం సరైన ఆటగాళ్లను ఎంపిక చేయలేదని సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌కు గురి కావడం.. సెమీస్‌లో ఇంగ్లాండ్‌ చేతిలో ఘోర ఓటమిపాలు కావడంతో సెలక్టర్లను తప్పించేసింది. కొత్త కమిటీ కోసం దరఖాస్తులను ఆహ్వానించి నెల రోజులు దాటినా ఇంకా ముఖాముఖిలు నిర్వహించాల్సి ఉంది. దీంతో కొత్త సంవత్సరంలోనే నూతన కమిటీని ప్రకటించే అవకాశం ఉంది. అయితే చీఫ్ సెలక్టర్‌గా ఉన్న చేతన్ శర్మను సెలక్టర్‌గా నియమించే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. కాగా, భారత్‌ క్రికెట్‌లో ఈ ఏడాది తయారైన కెప్టెన్ల జాబితా మరెప్పుడూ కాలేదేమో.

ఆటగాళ్లకు గాయాలు కావడం, పని ఒత్తిడి నుంచి మినహాయింపు, ఒకే సమయంలో వేర్వేరు సిరీస్‌లను ఆడేందుకు వెళ్లడం వంటి కారణాలతో ఆరుగురు సారథులు టీమ్‌ఇండియాను నడిపించారు. రోహిత్ శర్మతో సహా కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, హార్దిక్‌ పాండ్య, రిషభ్‌ పంత్, బుమ్రా వివిధ సందర్భాల్లో కెప్టెన్‌గా వ్యవహరించారు. అలాగే టీ20 ప్రపంచకప్‌ టోర్నీకి ముందు టీమ్‌ఇండియాకు భారీ దెబ్బ తగిలింది. స్టార్‌ పేసర్ బుమ్రా, ఆల్‌ రౌండర్‌ రవీంద్ర జడేజా గాయాల కారణంగా ఆడకపోవడం భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమ్‌ఇండియా మెగా టోర్నీల్లో విఫలమైతే.. మహిళా క్రికెటర్లు మాత్రం తమ ప్రతిభను చాటిచెప్పారు.

తొలిసారి కామన్వెల్త్‌ గేమ్స్‌లో ప్రవేశపెట్టిన ఉమెన్స్ క్రికెట్‌ పోటీల్లో రజత పతకం గెలిచి చరిత్ర సృష్టించారు. ఫైనల్‌లో ఆసీస్‌ చేతిలో ఓటమి మినహా.. టోర్నీ ఆసాంతం భారత్ ఆధిపత్యం ప్రదర్శించింది. అలాగే ఈ ఏడాది భారత మహిళా క్రికెటర్లకు బీసీసీఐ శుభవార్త చెప్పింది. పురుషులతో సమానంగా మ్యాచ్‌ను ఫీజు చెల్లించేందుకు బీసీసీఐ ఆమోద ముద్ర వేసింది. అయితే దిగ్గజ మహిళా క్రికెటర్లు మిథాలీరాజ్‌, ఝులన్‌ గోస్వామి క్రికెట్‌కు వీడ్కోలు పలికేశారు. అలాగే కొత్త సంవత్సరంలో మహిళల కోసం ఐపీఎల్‌ నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లను చేస్తోంది.  ఇక టీమ్‌ఇండియా నుంచి స్మృతీ మంధాన 'ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్' రేసులో నిలిచింది.

కొత్త ఏడాది సవాళ్లే సవాళ్లు

టీమిండియా 2023లో రెండు మెగా టోర్నీల్లో తలపడాల్సి ఉంది. ఆసియా కప్‌తో పాటు సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్‌ను ఆడనుంది. పాకిస్థాన్‌ వేదికగా ఆసియా కప్‌ జరగడంపై సందిగ్ధత నెలకొంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాక్‌కు భారత్‌ వెళ్లడం దాదాపు అసాధ్యమే. అదే జరిగితే తటస్థ వేదికకు టోర్నీ మారే అవకాశం లేకపోలేదు. ఇక భారత్‌లో జరిగే వన్డే ప్రపంచకప్‌ను గెలిచి 12 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలకాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఆ దిశగా జట్టును సన్నద్ధం చేయడంలో రాహుల్‌ ద్రవిడ్, రోహిత్ శర్మ  కీలక నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నారు. 



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News