టెర్రర్ కు గురి చేసిన వాట్సాప్ మెసేజ్ వారి పాప‌మే!

Update: 2019-06-14 06:11 GMT
నాలుగైదు రోజుల నుంచి ఒక వాట్సాప్ మెసేజ్ విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది. హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో మ‌హిళ‌లు విప‌రీతంగా అదృశ్య‌మ‌వుతున్నార‌ని.. రాత్రి వేళ‌.. జ‌ర్నీ చేయ‌టం.. ఆ మాట‌కు వ‌స్తే బ‌య‌ట‌కు రావ‌టం కూడా ప్ర‌మాదమేన‌ని పేర్కొంటూ చేసిన పోస్ట్ ఒక‌టి హ‌ల్ చ‌ల్ చేసింది. ఈ మెసేజ్ తో ల‌క్ష‌లాది మంది భ‌యాందోళ‌న‌ల‌కు గురి అయిన ప‌రిస్థితి.

కిడ్నాప్ ముఠాలు సంచ‌రిస్తున్నాయ‌ని.. అంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండాలంటూ భ‌యాందోళ‌న‌లు క‌లిగేలా వాట్సాప్ మెసేజ్ పోస్ట్ చేసిన ముగ్గురిని తాజాగా పోలీసులు గుర్తించారు. సోష‌ల్ మీడియాలో అస‌త్య ప్ర‌చారం చేస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు. జూన్ 8 ఒక్క రోజులోనే తెలంగాణ వ్యాప్తంగా 82 మంది ప‌త్తా లేకుండా పోయార‌ని.. హైద‌రాబాద్ సిటీలో కిడ్నాప్ ద‌ళాలు సంచ‌రిస్తున్నాయంటూ తెలంగాణ యువ‌సైన్యం పేరుతో ఒక పోస్ట్ వైర‌ల్ అయ్యింది.

దీనిపై సుమోటోగా కేసు న‌మోదు చేసిన పోలీసులు.. విచార‌ణ షురూ చేశారు. ఈ పోస్ట్ పెట్టిన వారు మోతీన‌గ‌ర్ కు చెందిన గురిజాల వెంక‌ట్‌.. ఈ ప్ర‌చారానికి ప్ర‌ధాన సూత్ర‌ధారి అన్న విష‌యాన్ని గుర్తించారు. అత‌నితో పాటు డిజైన‌ర్ గా ప‌ని చేస్తున్న యూస‌ఫ్ గూడ‌కు చెందిన క్రాంతికిర‌ణ్ నాయుడు.. మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాకు చెందిన కంటెంట్ డెవ‌ల‌ప‌ర్ బాల‌రాజుల‌ను గుర్తించి అరెస్ట్ చేవారు.

ఈ త‌ర‌హా వ‌దంతుల్ని న‌మ్మొద్ద‌ని.. పోస్టులో పేర్కొన్న‌ట్లుగా పెద్ద ఎత్తున హైద‌రాబాద్ నుంచి మ‌హిళ‌లు అదృశ్యం కావ‌ట్లేదంటూ పోలీసు క‌మిష‌న‌ర్ స్ప‌ష్టం చేశారు. ప్ర‌జ‌ల్లో భ‌యాందోళ‌న‌లు క‌లిగించేలా వ్య‌వ‌హ‌రించే వారిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ స్ప‌ష్టం చేశారు. సో.. పోస్టు వ‌చ్చింది క‌దా అని.. ఎవ‌రికి ప‌డితే వారికి ఫార్వ‌ర్డ్ చేయొద్దు. కాస్త జాగ్ర‌త్త‌గా ఆలోచించ‌టం చాలా అవ‌స‌రం.


Tags:    

Similar News