మోదీ రెండు సార్లే!...మ‌న్మోహ‌న్ లెక్క‌లేన‌న్ని సార్లట‌!

Update: 2019-05-03 04:16 GMT
మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ నిజంగానే మౌన‌మునే. ప‌దేళ్ల పాటు దేశానికి ప్ర‌ధాన‌మంత్రిగా కొన‌సాగిన మ‌న్మోహ‌న్ ఏనాడూ నోరు తెర‌చి పెద్ద‌గా మాట్లాడిందే లేదు. అయితే విప‌క్షంలోకి వ‌చ్చాక అప్పుడ‌ప్పుడైనా ఆయ‌న నోరు విప్పుతున్నారు. ఇలా మన్మోహ‌న్ ఎప్పుడు నోరు విప్పినా... అవ‌త‌లి వ‌ర్గానికి త‌డిసిపోతోంద‌నే చెప్పాలి. ప్ర‌స్తుతం దేశంలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల పేరిట పెద్ద యుద్ద‌మే జ‌రుగుతోంది. భావి ప్ర‌ధాని ఎవ‌ర‌న్న విష‌యాన్ని తేల్చేసే ఈ ఎన్నిక‌ల‌ను అధికార బీజేపీతో పాటు విప‌క్ష కాంగ్రెస్ కూడా అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగానే తీసుకున్నాయి. ఈ క్ర‌మంలో ఒక‌రిపై మ‌రొక‌రు స్థాయికి మించి వ్యాఖ్య‌లు చేస్తూ క‌ల‌క‌లం రేపుతున్నారు. ఈ క్ర‌మంలోనే పాక్ లోని ఉగ్ర‌వాద శిబిరాల‌పై ఇటీవ‌ల జ‌రిపిన స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ కు సంబంధించి ప్ర‌ధాని మోదీతో పాటు బీజేపీ నేత‌లు గొప్ప‌లు చెప్పుకుంటున్నారు. ఉగ్ర‌వాదాన్ని అణ‌చివేయ‌డంలో త‌మ‌కు సాటి రాగ‌ల వారెవ్వ‌రూ లేర‌ని కూడా క‌మ‌ల‌నాథులు చెప్పుకుంటున్నారు. ఈ వ్యాఖ్య‌ల‌పై మ‌న్మోహ‌న్ సింగ్ త‌న‌దైన శైలి రిటార్ట్ ఇచ్చారు.

ఉగ్ర‌వాదుల‌పై జ‌రిపిన దాడుల‌ను గొప్ప‌లుగా చెప్పుకుంటూ ఎన్నిక‌ల్లో ల‌బ్ధి పొందాల‌ని చూసే పార్టీలు - నేత‌లు ఇప్ప‌టిదాకా లేర‌ని సంచ‌ల‌న కామెంట్ చేసిన మ‌న్మోహ‌న్... ఇప్పుడు ఆ త‌ర‌హా దిగ‌జారుడు రాజ‌కీయం చేస్తున్న పార్టీగా బీజేపీ - అలాంటి నేత‌గా మోదీ నిలిచార‌ని మ‌న్మోహ‌న్ సెటైరిక‌ల్ పంచ్ లు సంధించారు. అయినా యూరీ - బాలాకోట్... ఈ రెండు చోట్లే మోదీ స‌ర్కారు స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ చేసింద‌ని గుర్తు చేసిన మ‌న్మోహ‌న్‌... త‌న హ‌యాంలో పాక్ భూభాగం కేంద్రంగా కార్య‌క‌లాపాలు సాగిస్తున్న ఉగ్ర‌వాదుల‌పై లెక్క‌లేన‌న్ని సార్లు స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ చేశామ‌ని - అయితే మోదీలాగా ఆ దాడుల‌ను ఎన్నిక‌ల్లో ల‌బ్ధి పొందేందుకు ఉప‌యోగించుకోలేద‌ని చుర‌క‌లు అంటించారు. గ‌తంలో ఇందిరా గాందీ కూడా ఈ త‌ర‌హా దిగ‌జారుడు రాజ‌కీయాలు చేయ‌లేద‌ని గుర్తు చేశారు. అయినా 56 అంగుళాల ఛాతీ అని చెప్పుకునే మోదీ... ఎన్నిక‌ల్లో సైనికుల శౌర్యం వెనుక దాక్కుంటున్నార‌ని కూడా మ‌న్మోహ‌న్ ఎద్దేవా చేశారు.

ముంబై దాడులు జ‌రిగిన స‌మ‌యంలో ఆ దాడుల‌కు సూత్ర‌దారిగా వ్య‌వ‌హ‌రించిన ల‌ష్క‌రే తోయిబా చీఫ్ హ‌ఫీజ్ స‌యీద్ ను అంత‌ర్జాతీయ ఉగ్ర‌వాదిగా ప్ర‌క‌టించే విష‌యంలో కేవ‌లం 14 రోజుల వ్య‌వ‌ధిలో చైనా చేత అంగీకారం తెలిపేలా చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని ఆయ‌న తెలిపారు. హఫీజ్ త‌ల‌పై 10 మిలియ‌న్ డాల‌ర్ల రివార్డును ప్ర‌క‌టించేలా అమెరికాను ఒప్పించామ‌ని కూడా ఆయ‌న చెప్పుకొచ్చారు. దివంగ‌త ప్ర‌ధానులు ఇందిరా గాంధీ, లాల్ బ‌హ‌దూర్ శాస్త్రిలు విదేశాల్లో దేశ ప్ర‌తిష్ఠను ఇనుమ‌డింప‌జేసిన గొప్ప నేత‌ల‌ని, వారిలో పోల్చుకుంటే మోదీ ఏ లెక్క‌లోకి కూడా రార‌ని కూడా మ‌న్మోహ‌న్ సింగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లే చేశారు. మొత్తంగా మౌన‌మునిగా ముద్ర వేయించుకున్న మ‌న్మోహ‌న్‌... స‌రిగ్గా ఎన్నికల వేళ బ‌య‌ట‌కు వ‌చ్చి మోదీని క‌డిగిపారేశార‌నే చెప్పాలి.t
   

Tags:    

Similar News