గద్దర్- అవార్డులపై ప్రీతిపాత్రుడు పవన్ కల్యాణ్ స్పందించి ఉంటే?
గద్దర్ పాల్గొనే సభలకు వెళ్లమంటూ పవన్ కల్యాణ్ తండ్రి వెంకటేశ్వరరావే ప్రోత్సహించేవారు.
తెలంగాణలోనే కాదు ఏపీలో చర్చనీయాంశం అయిన సంఘటన గద్దర్ అవార్డులు-గద్దర్ కు పద్మ పురస్కారం రాకపోవడం.. తుపాకీ పట్టిన విప్లవ మార్గాన్ని వీడి.. పాటనే తూటాగా ఎంచుకుని పోరాటం సాగించిన వ్యక్తి గద్దర్. తన గళంతో వేలాదిమందిని నక్సలైట్ ఉద్యమంలోకి ఆకర్షించింది. సమాజంలో ఉన్న మరెందరినో ప్రభావితం చేసింది.. అలాంటివారిలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. పార్టీ స్థాపించకముందు నుంచే పవన్ కు గద్దర్ తో అనుబంధం ఉంది. గద్దర్ ను ఆయన ఒక సామాజిక విప్లవకారుడిగా చూశారు. గద్దర్ పాల్గొనే సభలకు వెళ్లమంటూ పవన్ కల్యాణ్ తండ్రి వెంకటేశ్వరరావే ప్రోత్సహించేవారు.
చనిపోవడానికి ముందు.. గద్దర్ 2023లో ఆస్పత్రి పాలైనప్పుడు పవన్ చాలా చలించిపోయారు. నేరుగా ఆస్పత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. గద్దర్ కుటుంబంతోనూ పవన్ కు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇక గద్దర్ కూడా తనకు అవసరమైనప్పుడు చాలా చొరవగా జేబులో చేయి పెట్టి డబ్బులు తీసుకోగలిగే ఒకే ఒక వ్యక్తి పవన్ కల్యాణ్ అని పలుసార్లు చెప్పారు. మొత్తమ్మీద తెలుగు రాష్ట్రాల్లో గద్దర్ కు అత్యంత సన్నిహిత రాజకీయ, సినీ ప్రముఖుడు పవన్ కల్యాణ్ అని చెప్పాలి. వీరిద్దరిదీ అంతటి ఆత్మీయ సంబంధం.
గత వారం కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డులు ప్రకటించిన సందర్భంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తాము గద్దర్ పేరు ప్రతిపాదించినా పట్టించుకోలేదని మండిపడ్డారు. తెలంగాణకు జరిగిన అన్యాయంపై ప్రధాని మోదీకి లేఖ రాస్తానని చెప్పారు. అనంతరం దీనికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. గద్దర్ నేపథ్యాన్ని ప్రశ్నించారు. ఆయనకు పద్మ అవార్డు ఇవ్వబోం అని తేల్చిచెప్పారు.
తెలంగాణలో 2023 చివర్లో అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి... సినిమా అవార్డులను గద్దర్ పేరిట ఇస్తామని ప్రకటించారు. దీనిపై సినీ పరిశ్రమ స్పందించకపోవడంతో ఆయన అగ్రహం వ్యక్తం చేశారు కూడా.
తాజాగా గద్దర్ కు పద్మ అవార్డు రాకపోవడంపై బీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఏపీలోనూ గద్దర్ ను విమర్శిస్తూ బీజేపీ సీనియర్ నాయకుడు విష్ణువర్థన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
కాగా, గద్దర్- అవార్దుల అంశంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందిస్తే కథ వేరుగా ఉండేదేమో? గద్దర్ కే కాదు.. ప్రధాని మోదీకి పవన్ అత్యంత సన్నిహితులనే సంగతి తెలిసిందే. పైగా సినీ రంగంలో పవన్ టాప్ హీరోల్లో ఒకరు. రాజకీయంగానూ ఇప్పుడు సినీ నటుడు స్థాపించిన పార్టీ అయిన టీడీపీతో పాటు పద్మ అవార్డులు ఇచ్చే కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీతో కూడిన కూటమి ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సైతం మంచి సంబంధాలు ఉన్నాయి. ఇక పవన్ స్పందించి ఉంటే.. కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా మౌనం దాల్చేవారేమో..? ఏదిఏమైనా గద్దర్ తో ఉన్న అనుంబంధం రీత్యా అయినా పవన్ కల్యాణ్ నోరు విప్పి ఉంటే ఆ కథ వేరేగా ఉండేది.