పది నిమిషాలకు రూ.1800.. సిక్కోలులో హెలికాఫ్టర్ రైడ్
రథసప్తమి వేడుకలు పురస్కరించుకుని ఫిబ్రవరి 2 నుంచి 4వ తేదీ వరకు హెలికాఫ్టర్ టూరిజం పరిచయం చేసింది.
ఏపీలో అవకాశం ఉన్న ప్రతిచోటా టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతో భక్తితో జరిపుకునే రథసప్తమిని కూడా ఈ సారి టూరిజం స్పెషల్ గా మార్చేసింది. సూర్య భగవానుడి పుట్టిన రోజుగా ఏటా రథసప్తమి వేడుకలను నిర్వహిస్తుంటారు. శ్రీకాకుళం నగరంలోని అరసవల్లిలో సూర్యదేవుడి ఆలయంలో ఆ రోజున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అయితే ఈ సారి కూటమి ప్రభుత్వం రథసప్తమిని ప్రత్యేక ఆకర్షణగా మార్చింది.
సామాన్యులకు అందుబాటులో లేని హెలికాఫ్టర్ రైడ్ ను రథసప్తమి సందర్భంగా అందుబాటులోకి తెచ్చింది ఏపీ ప్రభుత్వం. రథసప్తమి వేడుకలు పురస్కరించుకుని ఫిబ్రవరి 2 నుంచి 4వ తేదీ వరకు హెలికాఫ్టర్ టూరిజం పరిచయం చేసింది. పదిహేను నిమిషాల రైడుకు రూ.1800 టికెట్ గా నిర్ణయించింది. అయితే పర్యాటకుల నుంచి విశేష ఆదరణ రావడంతో హెలికాప్టర్ రైడ్ ను అదనంగా 5వ తేదీ వరకు పొడిగించింది.
ఒక రైడ్ లో సుమారు ఆరుగురు ప్రయాణికులను ఎక్కిస్తున్నారు. పది నిమిషాల పాటు శ్రీకాకుళం నగరంపై చక్కర్లు కొడుతూ అరసవిల్లి ఆలయం, నాగావళి నది, జాతీయ రహదారి అందాలను చూపిస్తున్నారు. శ్రీకాకుళంలో ఇలాంటి సేవలు తొలిసారి అందుబాటులోకి రావడంతో పర్యాటకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ హెలికాఫ్టర్ రైడ్ ను ఏపీ పర్యాటకశాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా ఉండటంతో ప్రత్యేక చొరవ తీసుకుని ఈ టూరిజంను పరిచయం చేశారు.