37 దేశాల ప్ర‌జ‌లు ట్రంప్ లెక్క తేల్చారు

Update: 2017-06-28 05:45 GMT
ప్ర‌పంచానికి పెద్ద‌న్న లాంటి అమెరికా అధ్య‌క్షుడి స్థానంలో కూర్చున్న వారి తీరు ప్ర‌పంచం మీద ప్ర‌భావం చూపించ‌టం ఖాయం. అందుకే.. అమెరికా అధ్య‌క్ష ప‌ద‌విలో ఉన్న వారి తీరుపై ఒక్క అమెరికా ప్ర‌జ‌లే కాదు.. ప్ర‌పంచ ప్ర‌జ‌లూ ఆస‌క్తిగా ఎదురుచూస్తుంటారు.

అనూహ్యంగా అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి.. అధ్య‌క్ష హోదాలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ తీరుపై అమెరికాలో తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం కావ‌టం తెలిసిందే. ఒక్క అమెరికాలోనే కాదు.. ప్ర‌పంచంలోని ప‌లు దేశాల్లోనూ ఇదే తీరు ఉంద‌న్న విష‌యం తాజాగా నిర్వ‌హించిన స‌ర్వేలో స్ప‌ష్ట‌మైంది. ట్రంప్ నాయ‌క‌త్వం మీద ప‌లు దేశస్తుల విశ్వాసం అంత‌కంత‌కూ త‌గ్గిపోతున్న వైనం తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది.

అమెరికా అధ్య‌క్షుడిపై ప్ర‌పంచ దేశాల ప్ర‌జ‌ల విశ్వాసం ఎంతన్న విష‌యంపై  ప్యూ రీసెర్చ్ సెంట‌ర్ తాజాగా ఒక‌ స‌ర్వేను చేప‌ట్టింది. ఇందులో భార‌త్ తో స‌హా 37 దేశాల ప్ర‌జ‌లు పాల్గొన్నారు. ఇందులో ట్రంప్‌ కు మ‌ద్ద‌తు భారీగా త‌గ్గ‌టం గ‌మ‌నార్హం. అదే స‌మ‌యంలో ట్రంప్ ముందు అధ్యక్ష స్థానంలో కూర్చున్న ఒబామాకు పెద్ద ఎత్తున మ‌ద్ద‌తు ల‌భించ‌టం గ‌మ‌నార్హం.

గ‌తంలో ఇదే స‌ర్వేలో ఒబామాపై భార‌తీయులు 58 శాతం విశ్వాసం వ్య‌క్తం చేయ‌గా.. తాజాగా ట్రంప్ పై 40 శాతం ప్ర‌జ‌లు మాత్ర‌మే న‌మ్మ‌కం ఉంద‌న్నారు. ఇక‌.. ప్ర‌పంచంలోని 37 దేశాల ప్ర‌జ‌ల అభిప్రాయాన్ని చూస్తే.. ట్రంప్‌ ను కేవ‌లం 22 శాతం మంది మాత్ర‌మే స‌మ‌ర్థుడ‌ని.. ప్ర‌పంచానికి మంచి చేస్తాడ‌ని న‌మ్మ‌టం విశేషం. అదే స‌మ‌యంలో ఒబామాపై 64 శాతం మంది ప్ర‌జ‌లు న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేయ‌టం గ‌మ‌నార్హం. మెజార్టీ దేశ ప్ర‌జ‌ల‌కు భిన్నంగా ర‌ష్యా.. ఇజ్రాయిల్ దేశాల  ప్ర‌జ‌లు మాత్రం ట్రంప్‌ను న‌మ్ముతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News