తెలంగాణ సంచ‌ల‌న నిర్ణ‌యం: ‌రోజుకు 40 రైళ్లల్లో కూలీల త‌ర‌లింపు

Update: 2020-05-05 04:00 GMT
వ‌ల‌స కార్మికుల త‌ర‌లింపుపై తెలంగాణ ప్ర‌భుత్వం ముందుకు వ‌చ్చింది. కార్మికుల త‌ర‌లింపు పై రెండు రోజులుగా తీవ్ర చ‌ర్చ జ‌రిగిన అనంత‌రం తుది నిర్ణ‌యం తీసుకుంది. చివ‌ర‌కు వ‌ల‌స కార్మికుల‌ను వారి సొంత ప్రాంతాల‌కు త‌ర‌లించేందుకు నిర్ణ‌యించింది. ఈ క్ర‌మంలో రాష్ట్రంలో ఉన్న వలస కార్మికులను తమ సొంత రాష్ట్రాలకు పంపించే చ‌ర్య‌లు మంగళవారం నుంచి ప్రారంభ కానున్నాయి. వారం రోజుల పాటు రోజుకు 40 చొప్పున ప్రత్యేక రైళ్లు వ‌ల‌స కార్మికుల‌ను త‌ర‌లించేందుకు నడుపుతామ‌ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు.

హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలతో పాటు వరంగల్, ఖమ్మం, రామగుండం, దామరచర్ల తదితర ప్రాంతాల నుంచి కూడా రైళ్లు నడపనున్నట్లు వెల్లడించారు. బిహార్, ఒడిస్సా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలకు ప్ర‌త్యేక రైళ్లు నడపాల‌ని సోమ‌వారం ప్ర‌గ‌తిభ‌వ‌న్‌ లో నిర్వ‌హించిన స‌మావేశంలో ముఖ్య‌మంత్రి నిర్ణ‌యం తీసుకున్నారు. లాక్‌ డౌన్‌ తో వలస కార్మికులు పడుతున్న ఇబ్బందులపై అధికారులు - మంత్రుల‌తో చ‌ర్చించారు. రెండు రోజులుగా రాష్ట్రంలో వ‌ల‌స కార్మికులు - కూలీలు త‌మ‌ను సొంత ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌ని ఆందోళ‌న‌లు చేస్తుండ‌డాన్ని స‌మావేశంలో ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చింది. సొంత ప్రాంతాలకు వెళ్లేదుకు వ‌ల‌స కార్మికులు ఆసక్తి చూపుతుండడంతో వారిని త‌ర‌లించేందుకు ఏర్పాట్ల‌పై సుదీర్ఘంగా చ‌ర్చించారు.

తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రత్యేక రైళ్లు నడిపి కార్మికులను తమ స్వస్థలాలకు చేర్చాలని నిర్ణయించారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యతో మాట్లాడి మంగళవారం నుంచి 40 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాల‌ని కోరారు. ఈ కార్మికుల త‌ర‌లింపు వ్య‌వ‌హారం ప‌ర్య‌వేక్షించేందుకు ఇద్ద‌రిని ప్ర‌త్యేకాధికారులుగా నియ‌మించారు. వారే.. సీనియర్ ఐఏఎస్ అధికారి సందీప్ సుల్తానియా - సీనియర్ ఐపిఎస్ అధికారి జితేందర్ రెడ్డి. ప్రత్యేకాధికారులుగా నియమితులైన వారు వివిధ పోలీస్ స్టేషన్లలో త‌మ‌త‌మ ప్రాంతాల‌కు వెళ్తామ‌ని విజ్ఞ‌ప్తులు - ద‌ర‌ఖాస్తులు చేసుకున్న వారిని రైళ్లల్లో పంపించ‌నున్నారు. సొంత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయ‌డంతో కార్మికులు ఎవరూ ఆందోళన చెందవద్దని సీఎం కేసీఆర్ కోరారు. పోలీసుల‌తో సమన్వయం చేసుకుని కార్మికుల త‌ర‌లింపు స‌క్ర‌మంగా చేయాల‌ని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యంతో వ‌ల‌స కార్మికులు, కూలీల్లో హ‌ర్షాతిరేకాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇన్నాళ్లు ధ‌ర్నాలు చేసిన వారు ఇప్పుడు కేసీఆర్‌ కు జేజేలు ప‌లుకుతున్నారు.
Tags:    

Similar News