సోనియమ్మ నోటి మాట చెబితే..సారు చేతల్లో చూపించారుగా?

Update: 2020-05-05 23:30 GMT
వాయు వేగంతో నిర్ణయాలు తీసుకోవటం మాటలు చెప్పినంత ఈజీ కాదు. దానికెన్నో ఇబ్బందులు ఉంటాయి. పాలనా వ్యవస్థను పరుగులు తీయించటం మామూలు విషయం కాదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాటలెన్నో చెప్పే పార్టీలు అధికారం చేతిలోకి వచ్చాక ఇలాంటి సత్యాలన్ని బోధ పడుతుంటాయి. సుదీర్ఘ ఉద్యమ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన కేసీఆర్ లాంటి అధినేతకు ప్రజల ఆశలు.. ఆకాంక్షలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే ఉండదు.

అధికారం చేతిలో ఉన్నా.. అప్పుడప్పడు ఆయనలోని ఉద్యమకారుడు ఒక్కసారి బయటకు వచ్చేస్తుంటారు. అధికార పరిమితుల్ని పక్కన పెట్టేసి నిర్ణయాలు తీసుకుంటారు. తాజాగా అలాంటి నిర్ణయాన్ని ప్రకటించటం ద్వారా.. తాను మిగిలిన ముఖ్యమంత్రులకు భిన్నమన్న విషయాన్ని చేతల్లో చేసి చూపించారని చెప్పాలి. లాక్ డౌన్ వేళ.. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని వలస కూలీలు.. కార్మికుల విషయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తున్న తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. లాక్ డౌన్ ఎపిసోడ్ లో మోడీ సర్కారు వ్యతిరేకత మూటకట్టుకుందంటే అది వలసల విషయంలోనే అని చెప్పాలి.

ఈ విషయాన్ని గుర్తించిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ సోమవారం ఆసక్తికర వీడియో సందేశాన్ని విడుదల చేశారు. దేశంలోని వలస కార్మికుల్ని వారి సొంతూర్లకు చేర్చేందుకు అవసరమైన రైళ్లను కేంద్రం నడపాలని.. దానికైన ఖర్చును కాంగ్రెస్ పార్టీ భరిస్తుందన్న మాటను చెప్పి దిమ్మ తిరిగే షాకిచ్చారు. సోనియమ్మ మాటతో మోడీ సర్కారు డిఫెన్సులో పడింది. ఈ మాటకు కమలనాథులు కౌంటర్ ఇచ్చినా.. అందులో పస లేదని చెప్పాలి. సోనియమ్మ నోటి నుంచి వచ్చిన మాటో.. ఇప్పటికే వలసల తరలింపుపై పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్న కేసీఆర్.. మరే మాత్రం ఆలస్యం చేయకుండా తీసుకున్న నిర్ణయాన్ని చూస్తే.. ఒక్క విషయం మాత్రం స్పష్టమవుతుంది.

సోనియమ్మ నోటి వెంట వచ్చిన మాటల్ని.. చేతల్లో చూపించిన కేసీఆర్ తనకు తిరుగు లేదన్న విషయాన్ని మరోసారి స్పష్టం చేశారని చెప్పాలి. కొన్ని నిర్ణయాలు తీసుకోవటంలో ఆలస్యం జరిగినా.. ప్రత్యర్థులకు ఏ మాత్రం అవకాశం ఇవ్వని రీతిలో నిర్ణయాలు తీసుకోవటంలో కేసీఆర్ దిట్ట. ఆ విషయాన్ని సారు మరోసారి ఫ్రూవ్ చేశారని చెప్పక తప్పదు. ఏమైనా.. వలసల తరలింపు కోసం వారం రోజుల పాటు రోజుకు నలభై చొప్పున రైళ్లు నడపటమంటే మామూలు విషయం కాదు. రైలుకు పన్నెండు వందల మంది చొప్పున చూసుకున్నా.. రోజుకు దగ్గర దగ్గర 50వేలు.. వారంలో 3.5 లక్షల మందిని తరలించం టార్గెట్ గా చెప్పక తప్పదు.
Tags:    

Similar News