కొండ‌గ‌ట్టు వ‌ద్ద‌ ఘోర ప్ర‌మాదం..45 మంది మృతి!

Update: 2018-09-11 08:20 GMT
జగిత్యాల జిల్లాలో ఘోర ప్రమాదం జ‌రిగింది. తెలంగాణ‌లోని ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రం అయిన కొండగట్టు ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఘాట్‌ రోడ్డు లోని చివరి మూలమలుపు వద్ద ఆర్టీసీ బస్సు అదుపు తప్పి లోయప‌డ్డ‌ ఘటనలో 45 మంది మృతి చెందినట్లు స‌మాచారం. ఈ దుర్ఘ‌ట‌న‌లో మ‌రో 17 మంది గాయపడ్డారు. క్షతగాత్రులంద‌రినీ జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయ‌ప‌డ్డ వారిలో పలువురి పరిస్థతి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 70 మంది ప్ర‌యాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న గురించి తెలియగానే జగిత్యాల జిల్లా కలెక్టర్‌ శరత్‌ - ఎస్పీ సింధూశర్మ హుటాహుటిన అక్కడికి చేరుకొని పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు. ప్ర‌మాద తీవ్ర‌త అధికంగా ఉండ‌డంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న‌పై ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ - ఆప‌ద్ధ‌ర్మ మంత్రి ఈటల రాజేంద‌ర్ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. క్ష‌తగాత్రుల‌కు మెరుగైన వైద్యం అందించాల‌ని - స‌హాయ‌క చ‌ర్య‌లు ప‌ర్య‌వేక్షించాల‌ని...అధికారుల‌ను కేసీఆర్ ఆదేశించారు.

జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కొండగట్టు ఘాట్‌ రోడ్డుపైకి ఎక్కుతున్న సమయంలో ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. 70 మంది ప్ర‌యాణికుల‌తో శనివారం పేట నుంచి బయల్దేరిన ఈ బ‌స్సు కొండగట్టు మీదుగా జగిత్యాల వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జ‌రిగింది. ఘాట్‌ రోడ్డు చివరి మూలమలుపు స్పీడ్‌ బ్రేకర్‌ వద్ద బస్సు అదుపుతప్పి లోయలో పడింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు - ఎస్పీ సింధూ శర్మ - కలెక్టర్ శరత్ ఘటనాస్థలికి చేరుకున్నారు. వారితోపాటు స్థానికులు కూడా బ‌స్సులో చిక్కుకున్న ప్రయాణికులను వెలికితీశారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలిస్తున్నారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News