60 లక్షల మంది.. 7 లక్షల కోట్లు

Update: 2016-12-30 05:13 GMT
ఇది పాత నోట్ల లెక్క‌. ప్రధానమంత్రి నరేంద్రమోదీ గత నెల 8న పెద్దనోట్లు రద్దుచేసినట్లు ప్రకటించినప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు 60 లక్షల మంది వ్యక్తులు - సంస్థలు రూ.7 లక్షల కోట్ల విలువైన పాత నోట్లు డిపాజిట్ చేశారు. అయితే ఇందులో బ్లాక్ మ‌నీ - వైట్ మ‌నీ కూడా ఉంది. డిపాజిటర్లు తాము జమచేసిన నగదుకు ఆధారాలు చూపకుంటే బ్యాంకులు సదరు బ్లాక్‌ మనీని వైట్‌ మనీగా మార్చవని కేంద్రం హెచ్చరించింది. లెక్కలు చూపని నల్లధనంపై ప్రతి పైసాకు పన్ను వసూలుచేస్తామని స్పష్టం చేసింది. నిజమైన డిపాజిటర్లకు ఎటువంటి హాని ఉండదని పేర్కొన్నది. నల్లధనాన్ని వైట్‌ గా మార్చుకునేందుకు ప్రయత్నించిన వారిని మాత్రం వదిలి పెట్టబోమని కేంద్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు.

నోట్ల రద్దు తర్వాత కూడా లెక్కలు చూపని వారికి ఈ నెల 17న ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన (పీఎంజీకేవై) పేరిట కేంద్రం ఆమ్నెస్టీ పథకం ప్రకటించింది. అటువంటి వారంతా దర్యాప్తు సంస్థల నిఘా పరిధిలోకి వస్తారు. భారీ మొత్తంలో నగదు డిపాజిట్ చేసిన వారు ముందుకు వచ్చి పీఎంజీకేవై పథకంలో చేరుతారని భావిస్తున్నట్లు చెప్పా రు. అలాచేయని వారు సంతోషానికి దూరం కావాల్సి ఉంటుందన్నారు. బ్యాంకుల్లో జమచేసిన మొత్తం నగదు వైట్ మనీగా మారుతుందని పౌరులు భావిస్తున్నారు. కానీ అది నిజం కాదు. రోజువారీగా బ్యాంకుల్లో రూ.2 లక్షలు - రూ.5 లక్షలకు పైగా జమ చేసిన ఖాతాల వివరాలు తెప్పించుకుని వాటి వివరాలను పరిశీలిస్తున్నాం. సదరు ఖాతాదారుల పాత లావాదేవీల వివరాలతో సరిపోల్చిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటాం అని సీనియర్ కేంద్ర ప్రభుత్వ అధికారి తెలిపారు.

ఒక వ్యక్తి ఒకటికంటే ఎక్కువ బ్యాంకుల్లో ఖాతాల్లో నోట్లు డిపాజిట్ చేసినా ఐటీ శాఖ నిఘా కొనసాగుతుందని కేంద్రం స్పష్టంచేసింది. "మా వద్ద 60 లక్షలకు పైగా వ్యక్తులు - కంపెనీలు - సంస్థలు డిపాజిట్ చేసిన రూ.7 లక్షల కోట్ల విలువైన పాతనోట్ల సమాచారం ఉంది. ఇది మమ్నల్నీ ఆశ్చర్య పరుస్తున్నది. ఈ డిపాజిట్లను మేం పరిశీలిస్తాం అని అధికారులు తెలిపారు. కొందరు వ్యక్తులు రూ.3 - 4 లక్షల కోట్లు డిపాజిట్ చేసే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఆదాయంపన్ను రూపేణా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారీగా రెవెన్యూ లభిస్తుందని అంచనా వేస్తున్నాం. అయితే ఎవరినీ అనవసరంగా ఇబ్బందుల పాలు చేయం" అని అధికారులు తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News