పవన్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ అరెస్ట్... ఎవరీ సూర్యప్రకాశ్?
అవును... ఈ నెల 20న పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం బాగుజోలలో పవన్ పర్యటించగా.. ఆ సమయంలో విజయనగరం జిల్లాకు చెందిన బలివాడ సూర్యప్రకాశ్ (41) పోలీసుల దుస్తుల్లో హల్ చల్ చేశాడు.
ఉప ముఖ్యమంత్రి పవన్ ఇటీవల ఏజెన్సీలో పర్యటించిన నేపథ్యంలో ఓ నకిలీ ఐపీఎస్ అధికారి ఉండటం తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో సదరు నకిలీ ఐపీఎస్ అధికారి హడావిడి చేయడంతోపాటు.. భద్రతా సిబ్బందితో సెల్ఫీలు దిగాడు. పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగిన ఈ వ్యవహారంలో నకిలీ పోలీసును అదుపులోకి తీసుకున్నారు.
అవును... ఈ నెల 20న పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం బాగుజోలలో పవన్ పర్యటించగా.. ఆ సమయంలో విజయనగరం జిల్లాకు చెందిన బలివాడ సూర్యప్రకాశ్ (41) పోలీసుల దుస్తుల్లో హల్ చల్ చేశాడు. ఈ నేపథ్యంలో శనివారం (ఈ నెల 28) అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అనంతరం సాలూరు కోర్టులో హాజరుపరిచారు.
ఈ వివరాలు వెల్లడించిన ఏఎస్పీలు అంకిత సురానా, దిలీప్ కిరణ్... అసలు ఈ సూర్యప్రకాశ్ ఎవరు? ఎందుకు ఈ ప్రయత్నం చేశాడు? ఎవరిని నమ్మించడానికి చేశాడు? పవన్ కల్యాణ్ కు హాని చేసే ప్రయత్నం ఇందులో ఏమైనా ఉందా? మొదలైన విషయాలు వెల్లడించారు. అవేమిటనేది ఇప్పుడు చూద్దామ్!
సూర్యప్రకాశ్ తండ్రి 2005లో దత్తిరాజేరు మండలంలో 9 ఎకరాల భూమి కొనేందుకు ఒప్పందం చేసుకున్నారు. అయితే.. ఆయన 2020లో మృతిచెందిన తర్వాత వాటికి సంబంధించిన పత్రాలు దొరికాయి. ఈ సమయంలో ఆ భూమిని దక్కించుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ ఆలోచన చేసినట్లు చెబుతున్నారు. ఈ డ్రెస్ లో భూమి గల రైతులను బెదిరించాడు!
ఈ క్రమంలో... 2024 జనవరిలో ఐపీఎస్ కు ఎంపికయ్యానని స్నేహితులు, బంధువులకు చెప్పి హైదరాబాద్ కు వెళ్లాడు సూర్యప్రకాశ్. అనంతరం తిరిగి వచ్చి ఆ భూమిగల రైతులను బెదిరించాడు. ఈ క్రమంలో వారు 90 సెంట్లు రాసిచ్చారు.
ఈ ఏడాది ఆగస్టు 15న గరివిడిలోని ఓ ప్రైవేటు పాఠశాలలకు వెళ్లి ట్రైనీ ఐపీఎస్ అధికారిగా చెప్పుకున్నాడు. ఇండిపెండెన్స్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ క్రమంలో... చీపురుపల్లి డీఎస్పీ తదితరులను కలిసి, వారితో ఫోటోలు దిగి, వాటిని వాట్సప్ గ్రూపుల్లో పెట్టేవాడు. దీంతో... స్థానికులు పూర్తిగా నమ్మారు.
బొబ్బిలిలో బీటెక్, కర్ణాటకలో ఎంబీఏ పూర్తి చేసిన సూర్యప్రకాశ్... 2003-05లో ఆర్మీ సిపాయిగానూ పంజాబ్ లో పనిచేశాడు. అనంతరం ఆ జాబ్ వదిలేసి విజయనగరం వచ్చాడు. గతంలో తూనికలు-కొలతల శాఖలో పొందిన లైసెన్స్ తో ఇనిస్పెక్టర్ గా అవతారం ఎత్తి అక్రమ వసూళ్లు చేశాడని చెబుతున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా ఐపీఎస్ అధికారి వేషంలో ఏకంగా ఉప ముఖ్యమంత్రి పర్యటనలో పాల్గొన్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా అతడి వ్యవహారం గుట్టు రట్టయ్యింది.